ఎల్కతుర్తి/ భీమదేవరపల్లి, వెలుగు: రోడ్ల నిర్మాణాలు బాగుంటే గ్రామాలు మరింత అభివృద్ధి సాధిస్తాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ నుంచి మడిపల్లి వరకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.13 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి పొన్నం, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్పర్సన్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీతో కలసి ప్రారంభించారు. కుడా ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపడుతున్న సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కుడా సీపీవో అజిత్ రెడ్డిని మంత్రి ఘనంగా సన్మానించారు.
ఎల్కతుర్తి నుంచి దామెర వెళ్లే ప్రధాన రహదారిని మంత్రి పరిశీలించారు. బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన ఫొటోకు మంత్రి పొన్నం నివాళులర్పించారు. అనంతరం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో డాక్టర్ దేశాయ్ కుమార్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన నిహీరా కిడ్స్కేర్ఆస్పత్రిని మంత్రి ప్రారంభించారు. కాగా, గౌరవెల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులు పెంచిన భూ వ్యాల్యుషన్ ప్రకారం తమ భూములకు ధరలు చెల్లించాలని వినతి పత్రం అందజేశారు. స్పందించిన మంత్రి భూములు కోల్పోయే ప్రతి రైతుకు న్యాయం చేస్తామని అన్నారు.
