ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నం : పొన్నం ప్రభాకర్

ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నం : పొన్నం ప్రభాకర్

హైదరాబాద్​, వెలుగు :  ఆరోగ్యవంతమైన సమాజానికి తల్లిదండ్రులు తమ -5 ఏండ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆదివారం చింతల్ బస్తీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 

హైదరాబాద్ లో పోలియో చుక్కలు వేసేందుకు 2, 800 సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.  తల్లిదండ్రులు తమ పిల్లల నిండైన జీవితానికి పోలియో చుక్కలు వేయించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఈనెల 4,5,6 తేదీల్లో ఇంటింటా పోలియో చుక్కలు వేస్తారన్నారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్​ హుస్పేన్ , జిల్లా వైద్యాధికారి డాక్టర్ ​వెంకటి పాల్గొన్నారు. 

వికారాబాద్ జిల్లాలో 93 శాతం

వికారాబాద్ :  జిల్లావ్యాప్తంగా 545 పోలియో కేంద్రాల్లో 87,938 మంది పిల్లలకు 93% శాతం పల్స్ పోలియో చుక్కలు వేసినట్టు డీఎంహెచ్ ఓ  పాల్వన్ కుమార్ తెలిపారు. తొలిరోజు ఆదివారం రామయ్య గూడ పట్టణ పీహెచ్ సీలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి  బంగారు భవిష్యత్​ కు , పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని సూచించారు.

తార్నాక హెల్త్ సెంటర్ లో ..

సికింద్రాబాద్ :  తార్నాక హెల్త్​ సెంటర్​లో  డిప్యూటీ మేయర్​ మోతె శ్రీలతారెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కాంగ్రెస్​ నేతలు మోతె శోభన్​రెడ్డి, ప్రవీణ​లాల్​ తదితరులు పాల్గొన్నారు.  రాంగోపాల్​పేట్​ డివిజన్ పాన్ బజార్ ​లోని   హెల్త్​ సెంటర్ లో సనత్​నగర్​ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

పుప్పాలగూడ బస్తీలో ..

గండిపేట :  మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ బస్తీ దవాఖానలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రంగారెడ్డి కలెక్టర్ శశాంక్, నార్సింగి రూరల్ హెల్త్  సెంటర్ డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.