ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారత స్టాక్ మార్కెట్లు భారీ ఊరటను పొందాయి. సోమవారం భారీ నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అయిన ఇన్వెస్టర్లు అంతర్జాతీయంగా వచ్చిన సానుకూల సంకేతాలతో ధైర్యం తిరిగి పొందారు. దీంతో వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ ఇన్వెస్టర్ల సంపద మళ్లీ చిగురించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధానికి బ్రేక్ గురించి చేసిన ప్రకటనతో ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ రేట్లు చల్లారటంతో మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. ఇదే క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ మెుజ్తాబా ఖమేనీ అమెరికాతో చర్చలకు సానుకూలంగా ఉన్నారనే వార్తలు భారత మార్కెట్లను లాభాల్లోకి తీసుకెళ్లాయి. మార్కెట్ల క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1372, నిఫ్టీ 400 పాయింట్లు గెయిన్ అయ్యాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ 1168 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 1370 పాయింట్లు గెయిన్ అయ్యాయి. ఈ క్రమంలో మార్కెట్లను ముందుకు నడిపించిన కీలక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1) ఇరాన్ సానుకూల సంకేతాలు:
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ అమెరికాతో చర్చలకు సిద్ధమవ్వడం మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా టెహ్రాన్ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో కొన్ని కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రకటించడం దౌత్యపరమైన ముందడుగుగా కనిపిస్తోంది. ఇది యుద్ధం ముగుస్తుందనే ఆశలను చిగురింపజేసింది.
2) తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు:
గత కొద్ది రోజులుగా 110 డాలర్ల ఎగువన ట్రేడ్ అయిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు, ఇప్పుడు 104 డాలర్ల స్థాయికి దిగివచ్చాయి. ఇరాన్ ఇంధన క్షేత్రాలపై దాడులను ట్రంప్ 5 రోజుల పాటు వాయిదా వేయడంతో ముడిచమురు సరఫరాపై ఉన్న ఆందోళనలు తగ్గాయి. భారత్ వంటి దిగుమతి చేసుకునే దేశాలకు ఇది పెద్ద ఊరట.
3) వాల్యూ బయింగ్ పై ఇన్వెస్టర్ల మొగ్గు:
ఫిబ్రవరి 28 నుంచి యుద్ధ ప్రభావంతో నిఫ్టీ 50 ఏకంగా 10.6 శాతం పడిపోయింది. మార్కెట్లు భారీగా పతనమవ్వడంతో నాణ్యమైన షేర్లు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో రికవరీ కనిపించింది.
4) తగ్గిన ఇండియా విక్స్:
మార్కెట్లలో ఉన్న భయాలను సూచించే ఇండియా విక్స్ సూచీ 4 శాతం పైగా తగ్గి 25.60కి పడిపోయింది. ఇది ఇన్వెస్టర్లలో భయం తగ్గి, మార్కెట్ స్థిరత్వం వైపు వెళ్తోందనే సంకేతాన్ని ఇస్తోంది. అనిశ్చితి తగ్గినప్పుడు ఇన్వెస్టర్లు ధైర్యంగా పెట్టుబడులు పెడతారు.
►ALSO READ | అవునా నిజమా స్విగ్గీ: 2 ఏళ్లల్లోనే 2 నుంచి 18 రూపాయలకు పెరిగిన ప్లాట్ ఫాం ఛార్జీ
5) గ్లోబల్ మార్కెట్ల మద్దతు:
ఆసియా మార్కెట్లైన జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పీ, చైనా ఎస్ఎస్‌ఈ కంపోజిట్ భారీగా లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు కూడా పాజిటివ్ టోన్‌తో ముగియడం మన మార్కెట్లకు కలిసొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్ మారడంతో భారత బెంచ్‌మార్క్ సూచీలు పుంజుకున్నాయి.
6) స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గడువు పొడిగింపు:
స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ రవాణా మార్గాన్ని తెరిచేందుకు ఇరాన్ విధించిన గడువును ట్రంప్ పొడిగించడం మార్కెట్లకు బూస్ట్ ఇచ్చింది. రవాణా వ్యవస్థకు ఆటంకం కలగకపోతే ప్రపంచ వాణిజ్యం సాఫీగా సాగుతుందన్న నమ్మకం ఇన్వెస్టర్లలో బలపడింది.
