ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్స్ చేయటం ఇప్పుడు చాలా సర్వసాధారణంగా మారిపోయింది. అలా యాప్ లో ఆర్డర్ చేస్తే గుమ్మం ముందుకే కోరిన ఫుడ్ రావటం రోజురోజుకు ఖరీదుగా మారుతోంది. ఒకప్పుడు రూ.2 నుంచి రూ.5 వరకు ఉండే ఈ ఫ్లాట్ ఫారం ఫీజు ఇప్పుడు ఏకంగా రూ.20కి దగ్గరలోకి చేరుకుంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు స్విగ్గీ, జొమాటో తమ ప్లాట్‌ఫారమ్ ఫీజులను మరోసారి పెంచేశాయి. ప్రస్తుతం రెండు సంస్థలు కూడా ప్రతి ఆర్డర్‌పై దాదాపు రూ.17.58 జీఎస్టీతో కలిపి వసూలు చేస్తున్నాయి. గతంలో ఈ ఫీజు రూ.14.99 గా ఉండేది. అంటే దాదాపు 17 శాతం మేర భారం పెరిగింది.
ఫీజు రూపంలో స్విగ్గీ నేరుగా రూ.17.58 వసూలు చేస్తుండగా, జొమాటో తన బేస్ ఫీజును రూ.14.9 గా నిర్ణయించి.. దానికి అదనంగా రూ.2.68 జీఎస్టీని జోడిస్తోంది. మొత్తంగా వినియోగదారుడు చెల్లించేది మాత్రం ఒక్కటే. గత 7 నెలల్లో స్విగ్గీ ఈ ఫీజును పెంచడం ఇది నాలుగోసారి కావటంతో యూజర్లు పెదవి విరుస్తున్నారు. 2023లో కేవలం రూ.2తో మొదలైన ఈ ప్లాట్‌ఫారమ్ ఫీజు.. ఇప్పుడు రూ.18కి పెరగటం చాలా మందిని నిరాశకు గురిచేస్తోంది. పండుగ సీజన్ రద్దీ, ఇతర నిర్వహణ ఖర్చులను సాకుగా చూపుతూ ఫుడ్ అగ్రిగేటర్లు క్రమక్రమంగా ధరలను పెంచుకుంటూ పోతున్నాయి.
►ALSO READ | మహీంద్రా ధమాకా ఆఫర్స్: ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా ₹4 లక్షల వరకు డిస్కౌంట్
ఈ పెరుగుదల వినియోగదారుడికి స్వల్పంగా అనిపించినప్పటికీ.. కంపెనీల ఆదాయంపై ఇది భారీ ప్రభావం చూపుతోంది. దేశవ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో కలిసి రోజుకు సగటున 43 నుండి 45 లక్షల ఆర్డర్లను డెలివరీ చేస్తున్నాయి. అంటే ప్రతి ఆర్డర్‌పై రూపాయి పెంచినా రోజుకు కోట్లాది రూపాయల అదనపు ఆదాయం ఈ సంస్థలకు సమకూరుతుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం కేవలం ఈ ప్లాట్‌ఫారమ్ ఫీజుల ద్వారానే ఫుడ్ డెలివరీ కంపెనీలు ఏడాదికి రూ.4వేల కోట్ల వరకు ఆదాయాన్ని పొందుతున్నాయని తేలింది.
హోటల్ యాజమాన్యాల నుంచి వచ్చే కమీషన్లపై పరిమితులు ఉండటం.. ఇతర ఈ-కామర్స్ సంస్థల నుంచి పోటీ పెరగడంతో లాభాలను పెంచుకోవడానికి కంపెనీలు నేరుగా కస్టమర్లపైనే భారం వేస్తున్నాయి. కేవలం ఫుడ్ డెలివరీ మాత్రమే కాదు, ఫ్యాషన్, టికెటింగ్ వంటి ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఇప్పుడు ఇదే బాటలో నడుస్తున్నాయి.
