IPL 2026: ఐపీఎల్ 2025 విజయోత్సవ వేడుకల్లో చనిపోయిన ఫ్యాన్స్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) సహకారంతో చనిపోయిన అభిమానుల పేర్లపై స్టేడియంలో శాశ్వత సీట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తొలి మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం ప్రవేశ ద్వారం దగ్గర 11 మంది ఫ్యాన్స్ మృతుల జ్ఞాపకార్థం ఒక స్మారక ఫలకాన్ని ఆవిష్కరించబోతుంది.
అంతేకాదు, స్టేడియంలోని 11 సీట్లను శాశ్వతంగా వారి పేరుపై రిజర్వ్ చేసి.. ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇక్కడ జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లు సహా అన్ని ఈవెంట్లలో ఈ సీట్లు ఖాళీగానే కనిపిస్తాయని అధికారులు తేల్చి చెప్పారు. 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం 11వ నెంబర్ ప్రాక్టీస్ జెర్సీలను ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్ ధరించొద్దన్నారు. ఈ విషయాన్ని ఆర్సీబీ సీఈవో రాజేష్ మీనన్ ఇవాళ తెలియజేశారు. ఇది మా ప్రయాణంలో మాతోనే నడిచిన మా ఫ్యాన్స్ కోసం మేము అర్పించే నివాళి అన్నారు. మ్యాచ్ రోజు ఆటగాళ్లంతా నల్లని కళ్లద్దాలను కూడా ధరిస్తారని పేర్కొన్నారు.
ALSO READ : ఆర్సీబీకి బిగ్ షాక్.. టోర్నీ నుంచి ఫాస్ట్ బౌలర్ యష్ ఔట్
ఐపీఎల్ 2025లో జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. 18 ఏళ్ల తర్వాత ట్రోఫీని గెలవడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఆనందానికి హద్దేలేకుండా పోయింది. జూన్ 4న బెంగళూరులో నిర్వహించిన విజయోత్స వేడుక తీవ్ర విషాదంగా మారింది. ఈ విజయోత్స వేడుకలను చూసేందుకు లక్షల్లో అభిమానులు తరలిరావడంతో చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో చిన్నారులతో పాటు మహిళలు కూడా ఉన్నారు.
