- బీసీ సంక్షేమ శాఖలో సమస్యలన్నీ పరిష్కరిస్తం
- ఐఏఎస్, ఐపీఎస్ లు, నేతలు గురుకులలాను విజిట్ చేయాలి
- ఆదిలాబాద్లో గురుకుల విద్యార్థులకు యూనిఫామ్స్ ఇవ్వకపోవటంపై మంత్రి ఫైర్
- 9 కల్లా కాటమయ్య కిట్ల పంపిణీ పూర్తికావాలని ఆదేశం
- ఈ నెల 7న డిపార్ట్మెంట్పై రివ్యూ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: బీసీ సంక్షేమ శాఖలో ఉన్న అన్ని సమస్యలనూ దశల వారీగా పరిష్కరిస్తామని ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న అధికారులు డిపార్ట్ మెంట్ పై నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పారు. గురుకులాలను ఐఏఎస్, ఐపీఎస్ లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు విజిట్ చేయాలని సూచించారు. అక్కడ సమస్యలను తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకరావాలని, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. మంగళవారం సెక్రటెరియెట్ లో బీసీ సంక్షేమ శాఖపై మంత్రి రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
గురుకులాల్లో మౌలిక వసతులు, అధికారుల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో కూడా రిక్రూట్ మెంట్ పూర్తయిందని, త్వరలో అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇస్తామని మంత్రి తెలిపారు. ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తోందని మంత్రి అభినందించారు. అక్కడ గ్రూప్ 1లో 137 మంది, సివిల్స్ లో 96 మంది మెయిన్స్ కు ఎంపిక అయ్యారన్నారు. డీఎస్సీకి 574 మంది కోచింగ్ తీసుకుంటే 30 మందికి ర్యాంకులు వచ్చాయని తెలిపారు. గద్వాల్ బీసీ స్టడీ సర్కిల్ పనితీరు బాగాలేదని, మెరుగుపరుచుకోవాలని హెచ్చరించారు.
ఇక పాముకాట్లు ఉండొద్దు
నవంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు సందర్శిస్తానని పొన్నం వెల్లడించారు. స్కూల్ ఆవరణల్లో మొక్కలు పెంచాలన్నారు. పాముకాటు ఘటనలు జరగకుండా చూడాలన్నారు. జిల్లాల్లో ఏ సమస్య ఉన్నా.. కలెక్టర్ దృష్టికి స్థానిక ఎమ్మెల్యే తీసుకెళ్లాలని చెప్పారు. ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న గురుకులాల కోసం ప్రభుత్వ స్థలాలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గురుకుల విద్యార్థులకు యూనిఫాం అందించడంలో విఫలమైన అధికారులపై సీరియస్ అయ్యారు. వికారాబాద్ లో గతేడాది టెన్త్ పరీక్షల్లో పనితీరు బాగా లేకపోవడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల్లో సిబ్బంది కొరత ఉందని, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని మంత్రికి అధికారులు విజ్ఞప్తి చేశారు.
9కల్లా కాటమయ్య కిట్ల పంపిణీ పూర్తి
గీత కార్మికులకు కాటమయ్య కిట్లపై వారం రోజుల్లో శిక్షణ పూర్తి చేయాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. ఈ నెల 8-, 9వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా కాటమయ్య కిట్ల పంపిణీ పూర్తి చేయాలన్నారు. 7వ తేదీన బంజారా భవన్ లో జరగనున్న బీసీ సంక్షేమ శాఖ విస్తృత స్థాయి సమావేశంలో గురుకుల హాస్టల్ వార్డెన్ లు, ప్రిన్సిపాల్స్, డీబీసీవో, ఏబీడీవో, ఆర్సీవో, డీసీవోలు పాల్గొనాలని మంత్రి ఆదేశించారు. ప్రధాన మంత్రి యంగ్ అచీవ్మెంట్ స్కాలర్ షిప్ (పీఎం యశస్వి)పై విద్యార్థులకు, పేరెంట్స్ కు అవగాహన కల్పించాలని చెప్పారు.
ఈ నెల 31 వరకు అప్లై చేసుకోవచ్చని, దీని ద్వారా మెరిట్ విద్యార్థులకు రాష్ట్రం నుంచి 1,001 మందికి.. 9,10వ క్లాస్ ల వారికి 75 వేలు,11,12 విద్యార్థులకు లక్షా 25 వేల స్కాలర్ షిప్ అందుతుందన్నారు. బీసీ సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీ చేపడతామని, ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు. రివ్యూలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కమిషనర్ బాల మాయాదేవి, గురుకులాల సెక్రటరీ సైదులు, సీఈవో అలోక్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు పాల్గొన్నారు.
3 నుంచి చేప పిల్లల పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా చెరువులు నిండుకుండల్లా మారాయని, అన్ని చెరువుల్లో చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సీఎం ఈ నెల 3 నుంచి చేప పిల్లల పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో మత్స్యశాఖ తరపున చేపల పంపిణీ జరుగుతుందని మంత్రి పొన్నం వెల్లడించారు. జిల్లాల్లో మంత్రులు, విప్ లు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కార్పొరేషన్ల చైర్మన్ లు, ప్రభుత్వ సలహాదారులు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మత్స్య శాఖ స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్, డైరెక్టర్ ప్రియాంక అలా పాల్గొన్నారు.
వక్ఫ్ భూములను కాపాడుతం..
రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీల సర్వతో ముఖాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం సెక్రటేరియెట్ లో మైనార్టీ వెల్ఫేర్ పై మంత్రి పొన్నం రివ్యూ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్ లో ఇస్లామిక్ సెంటర్(వక్ఫ్)కు కేటాయించిన భూమిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే ముస్లిం విద్యార్థుల కోసం హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మైనారిటీ గురుకులాల్లో ముస్లిం విద్యార్థుల సంఖ్య తగ్గిపోకుండా ముస్లిం మత పెద్దలు చొరవ తీసుకోవాలని మంత్రి కోరారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా,మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ పాల్గొన్నారు.