
గండిపేట, వెలుగు: జన్మించిన కొద్ది సేపటికే శిశువు చనిపోవడంతో అంత్యక్రియలకు డబ్బుల్లేక ఆ డెడ్‌బాడీని చెరువులో వదిలేశారు పేద దంపతులు. హైదరాబాద్ మీర్ఆలం చెరువు వద్ద జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. చెరువులో శిశువు డెడ్‌బాడీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన ఫర్జానా, ఇస్మాయిల్ దంపతులు కొన్నేండ్లుగా అత్తాపూర్ చింతల్మెట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఫర్జానా శుక్రవారం రాత్రి ఇంట్లోనే నెలల నిండని శిశువుకు జన్మనిచ్చింది. అయితే కొద్దిసేపటికే శిశువు మృతిచెందడంతో అంత్యక్రియలకు డబ్బులు లేక డెడ్‌బాడీని చెరువులో వదిలి వెళ్లారు. చెరువులో శిశువు డెడ్ బాడీ తేలిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి దంపతులను గుర్తించారు. స్టేషన్‌కు పిలిపించి విచారించిన పోలీసులు, వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆలా చేయాల్సి వచ్చిందని తెలుసుకొని అంత్యక్రియల కోసం అవసరమైన సాయం అందజేశారు.