తిరుపతిలో దారుణం: బైక్ తీసుకొని అద్దె చెల్లించలేదని యువకుడిపై దాడి..

తిరుపతిలో  దారుణం: బైక్ తీసుకొని అద్దె చెల్లించలేదని యువకుడిపై దాడి..

తిరుపతిలో దారుణం జరిగింది.. బైక్ తీసుకొని అద్దె చెల్లించలేదని యువకుడిని చావబాదాడు అనిల్ రెడ్డి. గురువారం ( ఆగస్టు 7 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బైకులు అద్దె ఇచ్చే వ్యాపారం చేస్తున్న అనిల్ రెడ్డి దగ్గర బైక్ అద్దెకు తీసుకున్నాడు పవన్ అనే యువకుడు. నెలరోజులుగా అద్దె చెల్లించకుండా కుదువపెట్టి కనుమరుగయ్యాడు పవన్. దీంతో పవన్ కోసం గాలించిన అనిల్ రెడ్డి.. ఎట్టకేలకు పవన్ దొరకడంతో తన ఆఫీసుకు తీసుకెళ్లి రౌడీ షీటర్ దినేష్ రెడ్డి లాఠీతో చావగొట్టాడు అనిల్. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసం ఎదుట ఉన్న అనిల్ రెడ్డి ఆఫీసులో జరిగింది ఈ ఘటన. పవన్ తల్లిదండ్రులకు అనిల్ అనుచరుల ద్వారా  ఫోన్ చేసి లక్ష రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 

పవన్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అనిల్ రెడ్డితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.రౌడీ షీటర్ దినేష్ రెడ్డి కోసం గాలిస్తున్నారు పోలీసులు. అయితే.. అనిల్ రెడ్డి వైసీపీ నేత అని టీడీపీ శ్రేణులు, టీడీపీ నేత అని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.