భర్త కానిస్టేబుల్.. భార్య హౌస్ వైఫ్.. కన్న కొడుకు కళ్ల ముందే ముగిసిపోయిన జీవితాలు !

భర్త కానిస్టేబుల్.. భార్య హౌస్ వైఫ్.. కన్న కొడుకు కళ్ల ముందే ముగిసిపోయిన జీవితాలు !

అహ్మదాబాద్లో షాకింగ్ ఘటన జరిగింది. 8 ఏళ్ల వయసున్న కన్న కొడుకు ముందే పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న తన భర్తను భార్య కొట్టి చంపేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటన అహ్మదాబాద్ లో తీవ్ర కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళితే.. రాజ్ కోట్ కు చెందిన ముకేష్ పార్మర్ అనే పోలీస్ కానిస్టేబుల్కు అహ్మదాబాద్లో పోస్టింగ్ ఇవ్వడంతో షాపూర్ పోలీస్ క్వార్టర్స్లో భార్య, 8 ఏళ్ల కొడుకుతో కలిసి ఉంటూ డ్యూటీకి వెళుతున్నాడు.

అతని భార్య సంగీత పిల్లాడిని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండేది. అయితే.. ముకేష్ తను పనిచేస్తు్న్న పోలీస్ స్టేషన్లో ఒక మహిళా కానిస్టేబుల్తో సంబంధం ఉందని సంగీతకు అనుమానం ఉంది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య సోమవారం మధ్యాహ్నం భార్యాభర్త ఇంట్లో ఉండగా గొడవ జరిగింది. మాటామాటా పెరిగింది. ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. అంతటితో గొడవ సమసిపోలేదు. గొడవ పెద్దదై క్షణికావేశంలో సంగీత ఇంట్లో ఉన్న హెల్మెట్తో ముకేష్ తలపై కొట్టింది. 

దెబ్బ బలంగా తగలడంతో బాగా రక్తం పోయి ముకేష్ దెబ్బ తగిలిన కాసేపటికే చనిపోయాడు. ఈ హత్య జరిగిన నిమిషాల వ్యవధిలోనే తన 8 ఏళ్ల పిల్లాడిని ఉంచిన గదిలోకి వెళ్లి సంగీత గడియ పెట్టుకుంది. కన్న కొడుకు కళ్ల ముందే సంగీత కూడా గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. 8 ఏళ్ల పిల్లాడు బాగా ఏడుస్తుండటంతో ఇరుగుపొరుగు ఏంటా అని చూస్తే అప్పటికే ఘోరం జరిగిపోయింది. పోలీసులకు సమాచారం అందడంతో స్పాట్కు చేరుకున్నారు.

సంగీత రాసిన లెటర్ ఒకటి పోలీసులకు దొరికింది. ముకేష్ కు వివాహేతర సంబంధం ఉందని, తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఆమె ఆ లేఖలో రాసింది. ముకేష్ అఫైర్ పెట్టుకున్న అమ్మాయి విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని ఇరుగుపొరుగు పోలీసులకు తెలిపారు.