పులివెందులలో టెన్షన్ టెన్షన్.. వైసీపీ నేతల రక్తం కళ్లజూసిన టీడీపీ కార్యకర్తలు

పులివెందులలో టెన్షన్ టెన్షన్.. వైసీపీ నేతల రక్తం కళ్లజూసిన టీడీపీ కార్యకర్తలు

కడప: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక స్థానికంగా కాక రేపుతోంది. ఆగస్ట్ 12న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతలు స్థానికంగా ముమ్మరంగా పర్యటిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల రాముపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్సీ రమేష్, వేముల రాము వాహనాన్ని కారుతో ఢీకొట్టి, టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వి దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. దాడిలో పలువురికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. కడప జిల్లా నల్లగొండువారిపల్లెలో ఈ ఘటన జరిగింది. టీడీపీ కార్యకర్తల దాడిలో వేముల రాము తీవ్రంగా గాయపడ్డారు. దీంతో.. పోలీసులే ఆయనను చికిత్స నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రమేష్ యాదవ్కు స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ దాడి గురించి సమాచారం తెలుసుకున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి వేముల రామును పరామర్శించి ధైర్యం చెప్పారు. వైసీపీ శ్రేణులు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి భారీగా చేరుకోవడంతో స్థానికంగా పులివెందులలో హైటెన్షన్ నెలకొంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఆగస్ట్ 12న జరగనున్న ఉప ఎన్నికలో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 

ALSO READ : ఆలయ అర్చకుడిని సస్పెండ్ చేసిన టీటీడీ : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో రూల్స్ బ్రేక్ అంట..!

పులివెందుల టీడీపీ అభ్యర్థిగా అధికార టీడీపీ నుంచి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్‌ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మొయిళ్ల శివకళ్యాణ్ రెడ్డి పోటీలో ఉండటం గమనార్హం. మరో 8 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికపై ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి బరిలో నిలవడం, వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం కావడంతో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు టీడీపీ, వైసీపీ సీరియస్గా తీసుకున్నాయి.