
విధి నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించారంటూ నలుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకుంది టీటీడీ. ఇద్దరిని సస్పెండ్ చేయడంతో పాటు మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గతేడాది అక్టోబర్ 2వ తేదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రద్దీ పెరగడంతో గందరగోళం నెలకొంది. తమకు విధులు కేటాయించనప్పటికీ సదరు ఉద్యోగులు పవన్ కళ్యాణ్ ను అనుసరించడమే ఇందుకు కారణమని నివేదిక ఇచ్చారు విజిలెన్స్ అధికారులు.
ఈ క్రమంలో భద్రతా ఆటంకం కలిగేలా వ్యవహరించిన శ్రీనివాసమంగాపురంలో విధులు నిర్వహించే బాలాజీ రంగకుమార్ అనే అర్చకుడితో పాటు తిరుపతి ఈఈ కార్యాలయంలో పనిచేసే చీర్ల కిరణ్ అనే జూనియర్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకుంది టీటీడీ. సాధారణంగా ప్రముఖులు పర్యటనల సందర్భంగా ప్రోటోకాల్ సిబ్బంది, అర్చకులు, మేళం సిబ్బంది, అటెండర్లు, పారిశుధ్య కార్మికులకు మాత్రమే కొన్ని ప్రాంతాల్లో విధులు కేటాయిస్తారు. కానీ.. కొంతమంది సిబ్బంది తమకు విధులు కేటాయించనప్పటికీ పవన్ ను కలవాలని ఆలయంలోకి ప్రవేశించడంతో రద్దీ ఏర్పడినట్లు తెలిపింది టీటీడీ.
ఆలయంలోకి ప్రవేశించడానికి గల కారణాలు తెలియజేయాలని సస్పెండ్ చేసిన ఇద్దరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది టీటీడీ.ఇదిలా ఉండగా.. తన ఇంటిని ఇతరులకు కేటాయించడంతో పాటు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తేలడంతో ఆఫీస్ సబార్డినేట్ శంకర్, ప్రైవేట్ వ్యక్తులతో కలిసి వ్యాపారం నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ రామును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది టీటీడీ.