గుడిసెలు వేసుకున్న పేదలపై స్థానికులు దాడి

గుడిసెలు వేసుకున్న పేదలపై స్థానికులు దాడి
  • గుడిసెలు వేసినవారిపై కర్రలు, రాళ్లతో స్థానికుల దాడి
  • పలువురికి గాయాలు

హనుమకొండ, వెలుగు: హనుమకొండ జిల్లాలోని గుండ్లసింగారం మంగళవారం రణరంగంగా మారింది. గుడిసెలు వేసుకున్న పేదలపై స్థానికులు దాడికి దిగడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గుండ్ల సింగారం 174, 175 సర్వే నెంబర్లలో దాదాపు 13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిలో సీపీఐ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు వెయ్యి మంది నిరుపేదలు గుడిసెలు వేసుకుని రెండు నెలలుగా ఉంటున్నారు. ఇన్నిరోజులు సైలెంట్ గా ఉన్న స్థానికులు రెండు రోజుల నుంచి విభేదిస్తున్నారు. ఆ భూమిని గత ప్రభుత్వాలు తమకే కేటాయించాయని చెబుతూ గుడిసెవాసులతో వాదనకు దిగారు. సోమవారం అటువైపుగా రాకపోకలు సాగించకుండా రోడ్డుపై ముళ్ల కంప వేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కాస్త వాదన జరిగింది. ఇదే విషయమై స్థానికులతో మాట్లాడేందుకు మంగళవారం సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి ఆధ్వర్యంలో గుడిసెవాసులు ర్యాలీగా గుండ్లసింగారం బయల్దేరారు. పెగడపల్లి డబ్బాల సెంటర్​నుంచి ర్యాలీగా వెళుతుండగా స్థానికులు ఒక్కసారిగా సీపీఐ నాయకులతో పాటు గుడిసెవాసులపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఏం జరుగుతోందో తెలియక కొంతమంది గుడిసెవాసులు పరుగులు తీశారు. ఇరువర్గాల మధ్య గొడవ తీవ్రం కావడంతో గుండ్లసింగారం ఏరియా మొత్తం ఒక్కసారిగా రణరంగంగా మారింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. హనుమకొండ ఏసీపీ కిరణ్​ కుమార్​, కేయూ సీఐ దయాకర్, ఇతర పోలీసులు వెంటనే  ఘటనా స్థలానికి చేరుకున్నారు. లాఠీలతో ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో గుడిసెవాసులపై దాడులకు పాల్పడిన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడిలో దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. ఘటనలో ఇరువర్గాలపై  కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. 

టీఆర్ఎస్​ నేతలే చేయించిన్రు: బాధితులు

దాడి అనంతరం గుడిసెవాసులంతా కలిసి పెగడపల్లి డబ్బాల సమీపంలోని హనుమాన్ టెంపుల్​గ్రౌండ్​కు చేరుకున్నారు. పోలీసులు వారితో చర్చలు జరిపారు. ఆ సమయంలో దాడికి పాల్పడినవారిలో ఓ యువకుడు అక్కడకు వచ్చి వీడియోలు తీసే ప్రయత్నం చేశాడు. గమనించిన గుడిసెవాసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ యువకుడు అక్కడి నుంచి పరుగు తీసి పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లి డోర్ ​పెట్టేశాడు. పోలీసులు గుడిసెవాసులను అక్కడి నుంచి పంపించి యువకుడిని స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా గుడిసెవాసులు వారి గోడు వెలిబుచ్చారు. ఇండ్ల కిరాయిలు కట్టలేక గుడిసెలు వేసుకుని ఉంటున్న తమపై స్థానిక టీఆర్ఎస్​ నాయకులే దాడి చేయించారని ఆరోపించారు. దాదాపు 15 మంది గూండాలను తమపైకి పంపారని, వారంతా తమ కండ్లలో కారం కొట్టి రాళ్లు రువ్వి గాయపరిచారని వాపోయారు. తాము సామరస్యంగా మాట్లాడేందుకు వెళ్తే గూండాలను పెట్టి దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. గుండ్ల సింగారంలో సీపీఐ నాయకులు, గుడిసె వాసులపై దాడికి పాల్పడిన గూండాలను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. దాడిలో గాయపడిన బాధితులను ఎంజీఎంలో ఆయన పరామర్శించారు.  అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్​జోషికి వినతిపత్రం అందజేశారు. అనంతరం శ్రీనివాస్ రావు మాట్లాడుతూ భూమాఫియా దాడికి వెనకడుగు వేసేది లేదని, పేదలకు ఇండ్ల స్థలాలు దక్కేవరకు పోరాడతామని స్పష్టం చేశారు.