
- మొక్కుబడిగా అధికారుల తనిఖీలు
- సమస్యలను బయటికిరానివ్వని ప్రిన్సిపాల్స్
- కలెక్టర్ విజిట్ చేస్తున్నా మారని తీరు
వనపర్తి, వెలుగు : ప్రభుత్వ గురుకులాల్లో అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజనం వసతి కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలు గాడి తప్పుతున్నాయి. వనపర్తి జిల్లాలో మొత్తం 17 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వాటిలో సొంత భవనాలు 8 ఉండగా, అద్దె భవనాల్లో 9 ఉన్నాయి. ఏటా గురుకులాలకు లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తున్నా విద్యార్థులకు సరైన వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
మొక్కుబడిగా అధికారుల పర్యవేక్షణ..
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల స్కూళ్లు, జూనియర్ కాలేజీలు ఉన్నాయి. గురుకులాలను ఆర్సీవోలు, ఆర్ఎల్సీలు, అకాడమిక్ కో–ఆర్డినేటర్లు, విజిలెన్స్, జిల్లా సంక్షేమాధికారులు తనిఖీ చేస్తున్నా సమస్యలు తీరడం లేదు. అధికారులు పర్యవేక్షించే సమయంలో స్టూడెంట్లతో ఇంటారాక్ట్ కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం తరగతి గదులను తిరిగి చూడడం, ఆఫీస్ లో ప్రిన్సిపాళ్లు, స్టాఫ్ తో మీటింగ్ పెట్టి రావడంతో స్టూడెంట్లు తమ సమస్యలను అధికారులకు చెప్పుకునే వీలు లేకుండా పోతోంది. పైగా కొన్ని గురుకులాల్లో అక్కడి సమస్యలు, ఇబ్బందులు బయటికి రాకుండా ప్రిన్సిపాళ్లు, సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొన్ని గురుకులాల్లో ఏకంగా స్టూడెంట్లను బెదిరించడంతోపాటు సమస్యలపై ప్రశ్నించిన వారిని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిసింది.
లక్షల్లో అద్దె.. కానరాని సదుపాయాలు..
జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు ప్రతినెలా లక్షల్లో డబ్బులు చెల్లిస్తున్నా కనీస సదుపాయాలు కల్పించడం లేదు. జిల్లాలోని మైనార్టీ గురుకుల స్కూళ్లు, జూనియర్ కాలేజీల అద్దెలను పరిశీలిస్తే జగత్ పల్లి శివారులోని మైనార్టీ బాయ్స్ స్కూల్ కు ప్రతి నెలా రూ.1.47 లక్షలు, మైనార్టీ బాయ్స్ జూనియర్ కాలేజీకి రూ.95 వేలు, కొత్తకోట మండలం కానాయపల్లిలోని మైనార్టీ బాయ్స్ స్కూల్ కు రూ.1.54 లక్షలు, కొత్తకోట మైనార్టీ బాయ్స్ జూనియర్ కాలేజీ కి రూ.88 వేలు ఇలా ప్రతినెలా అద్దె చెల్లిస్తున్నారు.
అద్దె భవనాల్లో ఉండే గురుకులాల్లో స్టూడెంట్స్ బాత్రూంలు, టాయిలెట్లు, తాగునీరు, దోమలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్ల మధ్య పాఠశాలలు ఉండడం, ప్లే గ్రౌండ్ లేకపోవడం వంటి అనేక సమస్యలు ఉంటున్నాయి.
కలెక్టర్ విజిట్ చేస్తున్నా మారని తీరు..
వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకుల స్కూళ్లు, కాలేజీలను కలెక్టర్ ఆదర్శ్ సురభి సమయం దొరికినప్పుడల్లా విజిట్ చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థలు గొప్పగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నా కొన్ని గురుకులాల సిబ్బందిలో తీరు మారడం లేదు. కలెక్టర్ విజిట్ సమయంలో అన్ని సక్రమంగానే ఉన్నట్లు హడావిడి చేయడం ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో విద్యార్థులు సతమతమవుతున్నారు. ప్రిన్సిపాల్స్ నిర్లక్ష్యం, సిబ్బందిలో జవాబుదారీతనం లోపించడంతో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గురుకులాలను పక్కాగా పర్యవేక్షణ చేసి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
వనపర్తి జిల్లాలో గురుకులాల వివరాలు..
గురుకులాలు మొత్తం సొంత అద్దె
బీసీ 3 2 1
ఎస్సీ 6 3 3
ఎస్టీ 2 2 0
మైనార్టీ 6 1 5