కార్టూనిస్టు బాలి ఇక లేరు

కార్టూనిస్టు బాలి ఇక లేరు

కార్టూనిస్టుగా తెలుగు పత్రికా రంగాన్ని  దశాబ్దాల కాలం పాటు తన బొమ్మలతో ఉర్రూతలూగించిన ప్రముఖ చిత్రకారులు బాలి సోమవారం అర్థరాత్రి అనారోగ్యంతో విశాఖపట్నంలో కన్నుమూశారు.  అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న బాలిని చూసుకొనేందుకు  ఆయన కుమార్తె అమెరికా నుండి విశాఖపట్నం వచ్చారు. అస్వస్థతతో  చికిత్స పొందుతున్న బాలి సోమవారం అర్దరాత్రి  తుదిశ్వాస విడిచారు. బాలి కుమారుడు  కూడా ఇటీవలే అమెరికాలో ప్రమాదంలో కన్నుమూశారు.
కళాకారులు, కార్టూనిస్టుల సంతాపం..
బాలి మృతిపట్ల పలువురు కళాకారులు, కార్టూనిస్టులు సంతాపం తెలిపారు. తమ ఆత్మీయ మిత్రుడు , ప్రముఖ చిత్రకారుడు బాలి అస్తమించాడన్న వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది అమెరికాలో కుమారుని మరణమే బాలిని కుంగదీసిందని స్మరించుకుంటూ సంతాపం ప్రకటించారు.
శంకరరావు పేరును 'బాలి'గా మార్చారు...
బాలి అసలు పేరు మేడిశెట్టి శంకరరావు. 1942 సెప్టెంబర్‌ 29న అనకాపల్లిలో అన్నపూర్ణ, లక్ష్మణరావు దంపతులకు జన్మించిన బాలి విద్యాబ్యాసం అంతా అక్కడే జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌ లో ఇరిగేషన్‌ డిపార్ట్‌ మెంట్‌ లో చేరారు. కానీ చిత్రలేఖనం పట్ల ఉన్న మక్కువతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1974లోఈనాడు దిన పత్రిక విశాఖపట్నం ఎడిషన్‌ లో పొలిటికల్‌ కార్టూనిస్టుగా చేరారు. 1976లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో సాఫ్ట్‌ కార్టూనిస్టుగా చేరినప్పటి నుండి బాలి చిత్రలేఖన విశ్వరూపం మొదలైంది. ఆ పత్రిక సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ మేడిశెట్టి శంకరరావు పేరును 'బాలి'గా మార్చారు.
 బాపు బాటలో కొన్ని వందల గ్రీటింగ్‌ కార్టూన్లు...
ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న సమయంలోనే వేలాది కథలకు బొమ్మలు గీశారు. నవలలకు ముఖచిత్రాలను వేశారు. బాపు బాటలో సాగుతూ, వందల గ్రీటింగ్‌ కార్టూన్స్‌ ను రూపొందించారు.  1984లో ఆంధ్ర జ్యోతి సంస్థ నుండి బయటకు వచ్చిన బాలి ఫ్రీలాన్సర్‌ గా కెరీర్‌ కొనసాగించారు. కొంతకాలం హైదరాబాద్‌ లోని కలర్‌ చిప్స్‌ లో యానిమేటర్‌ గా సేవలు అందించారు.
 అంతర్జాతీయ కార్టూన్‌ పోటీల్లో బహుమతులు...
చిత్రలేఖనంతో పాటు బాలి కార్టూనిస్టుగానూ విశేష పేరు ప్రఖ్యాతులను ఆర్జించారు. ఆయన తొలి కార్టూన్‌ ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది. ఆయన బొమ్మలు, కార్టూన్లు ప్రచురితం కాని పత్రిక లేదంటే అతిశయోక్తి కాదు. వివిధ వార, పక్ష, మాస పత్రికల్లో బాలి కార్టూన్‌ శీర్షికలూ నిర్వహించారు. అంతర్జాతీయ కార్టూన్‌ పోటీల్లో బాలి కార్టూన్లు బహుమతులు పొందాయి.
 ప్రముఖులతో పరిచయాలు
ఆయన వేసిన బొమ్మలు ప్రముఖుల మనసులను హత్తుకునేవి. ఆంధ్ర పత్రికలో ఆయన ప్రస్థానం మొదలైనా మంచి పేరు వచ్చింది మాత్రం ఆంధ్రజ్యోతిలోనే అంటారు.  ఆయన పుస్తకాలు బాగా చదువుతారు. బాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. కార్టూన్‌ చిత్రాలతో ఎనిమిది  పుస్తకాలు రాశారు. మరెన్నో కథలు కూడా రాశారు. జోక్స్‌ పై సంచలనమే ఇచ్చారు.
 బాధాకర విషయం ఏంటంటే ... 
ఆయన భార్య ధనలక్ష్మి 2010లోనే మృతి చెందారు. కుమారుడు గోకుల్‌ కూడా ఇటీవల మంచు ప్రమాదంలో చిక్కుకొన్న  వేరొకరిని రక్షించబోయి మృతి చెందారు. బాలి కుమార్తె వైశాలి అమెరికాలో ఉంటున్నారు. బాలి మృతితో పుట్టి, చదువుకున్న అనకాపల్లి, పెరిగిన దేశపాత్రునిపాలెం, స్థిరపడిన విశాఖ ప్రాంతాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. బాలి మృతి ఎంతోమంది కళాకారుల్ని కలిచివేసింది. ఆయన కార్టూన్లు  మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.