కరోనాతో ప్రముఖ కమెడియన్ పాండు మృతి

కరోనాతో ప్రముఖ కమెడియన్ పాండు మృతి

కరోనాతో ఇప్పటికే చిత్రసీమకు చెందిన పలువురు నటులు మరణించారు. తాజాగా ప్రముఖ హాస్య నటుడు, తమిళనాడుకు చెందిన పాండు(74) మృతిచెందారు. ఆయన గురువారం ఉదయం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పాండు, ఆయన భార్య కుముధ కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. దాంతో వారు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా.. పాండు ఆరోగ్యం విషమించడంతో గురువారం తెల్లవారుజూమున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి చిత్రసీమకు తీరనిలోటని పలువురు నటులు, నిర్మాతలు, ప్రొడ్యూసర్లు పేర్కొన్నారు. ఆయన మృతిపట్ల తమిళ సినీరంగం తన సానుభూతిని ప్రకటించింది. 

పాండు తన కామెడితో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ఎంతో ఆదరణ సంపాదించారు. పాండు 1970లో వచ్చిన ‘మానవాన్’ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. కాగా.. 1981లో విడుదలైన ‘కరాయిల్లమ్ షెన్బాగపూ’ సినిమా ద్వారా పాండుకు మంచి బ్రేక్ వచ్చింది. అప్పటినుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. తమిళ్‌తో పాటు పలు భాషలలో కూడా ఆయన నటించారు. తమిళంలో వచ్చిన చిన్న తంబి, బద్రి, కాదల్ కొట్టై, తెలుగులో వచ్చిన డబ్బింగ్ సినిమాలు సింగం, కాంచన 2 సినిమాలలో పాండు నటించారు.