సబ్జెక్ట్ ఏదైనా.. ఆయన తీశారంటే దాని తీరే వేరు..!

సబ్జెక్ట్ ఏదైనా.. ఆయన తీశారంటే దాని తీరే వేరు..!

కొందరు వ్యక్తులు ఏం చేసినా బాగుంటుంది. కొందరు దర్శకులు ఏం తీసినా బాగుంటుంది. కేవీ రెడ్డి కూడా అంతే. చారిత్రకం, జానపదం, సాఘికం.. సబ్జెక్ట్ ఏదైనా సరే.. ఆయన తీశారంటే దాని తీరే వేరుగా ఉండేది. తెలుగు చిత్రసీమకు సరికొత్త వన్నె తెచ్చిన దర్శకుడాయన. ఆయన బాణి ప్రత్యేకం. ఆయన శైలి సంపూర్ణం. ఆయన ఏం తీసినా అది అజరామరం.  

‘భక్తపోతన’ సినిమాతో డైరెక్టర్ గా..
హిచ్‌ కాక్, జేమ్స్ కామెరూన్, స్పీల్‌బర్గ్ లాంటి వాళ్ల టేకింగ్‌ చూసి వారేవా అంటూ అబ్బురపడుతున్నాం. కానీ అప్పట్లోనే తన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ తో ఔరా అని ముక్కున వేలేసుకునేలా చేశారు కేవీ రెడ్డి. 1912లో ఇదే రోజున పుట్టిన కేవీ రెడ్డి పూర్తి పేరు కదిరి వెంకటరెడ్డి. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అనంతపురం జిల్లా, తాడిపత్రిలో మేనమామ దగ్గర పెరిగారు. అక్కడే చదువుకున్నారు. స్కూల్ చదువు పూర్తయ్యాక మద్రాసు వెళ్లి మెట్రిక్, డిగ్రీ పూర్తి చేశారు. ఉద్యోగం దొరక్కపోవడంతో చిన్న వ్యాపారం మొదలుపెట్టారు. అప్పుడే తాడిపత్రిలో తన క్లాస్‌మేట్ అయిన మూలా నారాయణస్వామి రూపంలో అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. అతని ద్వారా రోహిణీ పిక్చర్స్ సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్‌‌గా పనికి చేరారు కేవీ. సుమంగళి, దేవత లాంటి సినిమాలకు పని చేస్తూనే సినిమా తీయడానికి అవసరమైన మెళకువలన్నీ నేర్చేసుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి.. అదే సంస్థ తీసిన ‘భక్తపోతన’ సినిమాతో డైరెక్టర్ గా మారారు. మొదటి సినిమాయే హిట్ కావడంతో అందరి దృష్టీ ఆయన వైపు మళ్లింది. ఆ తర్వాత యోగి వేమన, గుణ సుందరి కథ సినిమాలు తీసిన కేవీ.. నెక్స్ట్ తీసిన సినిమాతో ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యారు. ఆ సినిమా మరేదో కాదు.. పాతాళ భైరవి.

‘పాతాళభైరవి’ కొత్త ట్రెండుని సృష్టించింది..
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘పాతాళభైరవి’ సినిమా అప్పట్లో కొత్త ట్రెండుని సృష్టించింది. ఇండియాలో జరిగిన తొలి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మన దేశం నుంచి ప్రాతినిథ్యం పొందిన సినిమా పాతాళభైరవి ఒక్కటే. తెలుగు, తమిళ భాషల్లో ఒకే సమయంలో ఒకే హీరోతో రూపొందిన మొదటి సినిమా కూడా ఇదే. సాహసం సేయరా డింభకా, జై పాతాళ భైరవి లాంటి డైలాగ్స్ ప్రేక్షకులకి చాలా కొత్తగా అనిపించడం.. స్క్రీన్‌ ప్లే కట్టిపడేయడంతో కేవీ రెడ్డికి సలామ్ కొట్టారంతా. ఆపైన పెద్ద మనుషులు, దొంగరాముడు చిత్రాలు తీశారు కేవీ. ఆ వెంటనే మరో సంచలనానికి తెర లేపారు.. మాయజాబజార్‌‌తో. టాలీవుడ్‌ క్లాసిక్స్ లో మొదటి వరుసలో నిలిచే సినిమా ఇది. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి లాంటి మహామహులంతా నటించడం.. రిచ్ విజువల్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, బ్యూటిఫుల్ సాంగ్స్, డిఫరెంట్ డైలాగ్స్ తో చూసినవాళ్ల మతులు పోగొట్టిందీ చిత్రం. కంప్యూటర్సే లేని రోజుల్లో ఆ గ్రాఫిక్స్ ను ఎలా తీశారో ఇప్పటికీ చాలామందికి అర్థం కాదు. దీన్ని కూడా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు కేవీ రెడ్డి. హిందీలోకి మాత్రం డబ్ చేశారు. మూడు గంటల పాటు అభిమన్యుడి చుట్టూ తిరిగే ఈ కథలో.. పాండవులు ఎక్కడా కనిపించకపోయినా వాళ్లు లేరేంటనే ఆలోచనే కలగనంతగా ప్రేక్షకులు లీనమైపోయారంటే అది కేవీ రెడ్డి టేకింగ్ స్టైల్ వల్లే. ఇక ఆ తర్వాత పెళ్లినాటి ప్రమాణాలు, జగదేక వీరుని కథ చిత్రాలు కూడా తీశారు కేవీ రెడ్డి.

 

ఫెయిల్యూర్స్ తో కుంగిపోయి..
1963లో శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా వరకు అంతా బాగానే నడిచింది. కానీ తర్వాత కేవీ తీసిన సత్య హరిశ్చంద్ర, ఉమాచండీ గౌరీ శంకరుల కథ, భాగ్యచక్రము లాంటి చిత్రాలు విఫలమయ్యాయి. వాటిలో కేవీ రెడ్డి అసలు లేనే లేదనేది నాటి ప్రేక్షకుల ఫీలింగ్. అయితే ఆ తర్వాత మళ్లీ తన మార్క్తో ‘శ్రీకృష్ణ సత్య’ తీసి హిట్టు కొట్టారు కేవీ రెడ్డి. అయితే అదే ఆయన చివరి చిత్రం. ఫెయిల్యూర్స్ తో కుంగిపోయి చనిపోకుండా ఒక్కటైనా హిట్ కొట్టి తన కథకు ముగింపు పలకాలని కేవీ రెడ్డి ఆరాటపడుతున్న సమయంలో.. ఎన్టీఆర్‌‌ ఆయన దగ్గరకు వచ్చి చాణక్య చంద్రగుప్త, శ్రీకృష్ణసత్య చిత్రాల్లో ఏదో ఒకదాన్ని డైరెక్ట్ చేయమని చెప్పారట. ఆయన రెండోదాన్ని ఎంచుకున్నారు. మనసు పెట్టి ఆ సినిమా తీశారు. విజయం సాధించారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో.. శ్రీకృష్ణసత్య రిలీజైన తర్వాతి సంవత్సరమే కన్నుమూశారు కేవీ రెడ్డి.

నేటి దర్శకులందరికీ అందరికీ స్ఫూర్తిదాయకం..
ఆయన జీవితం.. నేటి దర్శకులందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన సినిమా తీసిన విధానం, దర్శకుడు కావాలని ఆశపడే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పాఠం. క్లీన్ ఫ్రేమ్ పెట్టుకుని, స్క్రిప్టుకి నూరుశాతం న్యాయం చేస్తూ, సింపుల్‌గా హాయిగా కథ చెప్పడమే కేవీ రెడ్డి టెక్నిక్. పాత్రలు నేచురల్‌గా ఉండేవి. మాటలు సూటిగా ఉండేవి. పాటలు ఆహ్లాదంగా ఉండేవి. మొత్తంగా సినిమాయే ఓ సరికొత్త అనుభూతినిచ్చేది. అదంతా కేవీ రెడ్డి మ్యాజిక్. మూడు దశాబ్దాల కాలంలో పద్నాలుగు సినిమాలు మాత్రమే తీసినా.. భావి తరాలు తన గురించి చెప్పుకోకుండా ఉండలేనంత గొప్ప సినిమాలు తీశారాయన. అందుకే నేటికీ తెలుగు సినీ చరిత్రలో ఆయన పేరు ఠీవిగా నిలబడి ఉంది.