పృథ్వీ లాంటి వాళ్ల వల్లే సీఎం జగన్ కి నష్టం

పృథ్వీ లాంటి వాళ్ల వల్లే సీఎం జగన్ కి నష్టం

హైదరాబాద్: ఏపీ రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులను పెయిడ్ అర్టిస్ట్ లని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు, వైసీపీ నేత పృథ్వీ పై పోసాని కృష్ణమురళీ ఫైర్ అయ్యారు. రాజధాని కోసం భూములు ఇస్తే వారిని తిట్టడం  సమంజసం కాదని అన్నారు. అమరావతిలో ఆందోళనలు రైతుల పట్ల పృధ్వీ మాట్లాడిన తీరు పై అమీర్ పెట్ లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన పోసాని.. పృథ్వి లాంటి వారి వల్లే జగన్ ప్రభుత్వానికి నష్టం కలుగుతుందన్నారు. పృథ్వి  వల్ల సోషల్ మీడియా లో ఏపీ సీఎం జగన్  ను నెటిజన్లు నానా భూతులు తిడుతున్నారన్నారు.

‘‘రాజధాని కోసం ఏడాదికి మూడు పంటలు పండించే భూములిచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటావా? రైతులు ప్యాంటూ, షర్ట్‌ వేసుకోకూడదా? రైతు ఆడపడుచులు ఖరీదైన బట్టలు వేసుకోకూడదా? బంగారు గాజులు వేసుకోకూడదా? వాళ్లు ఫోన్‌ చేతిలో పెట్టుకొని మాట్లాడకూడదా? రైతులు ఖరీదైన కార్లలో తిరగకూడదా? ఇలాంటి మాటలు అన్నందుకు నువ్వు సిగ్గుపడాలి. సీఎం జగన్‌ ఏడాదిన్నర పాటు పాదయాత్ర చేసిన సమయంలో జనం గురించి ఎప్పుడు తేలికగా  మాట్లాడలేదు. సీఎం అయిన తర్వాత ఏ కులం పేరూ ఎత్తలేదు. జగన్‌ను, ప్రభుత్వాన్ని నాశనం చేసేందుకు మీలాంటి వాళ్లు పుట్టారు.. సిగ్గుపడండి’’ అంటూ మండి పడ్డారు పోసాని. రైతులను, ఆడపడుచులను కించపరిచేలా మాట్లాడినందుకు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి భేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.

రైతుల పట్ల పృధ్వీ మాట్లాడిన మాటలకు పార్టీ తరుపున తాను క్షమాపణ చెప్పారు పోసాని. జగన్ అమరావతి రైతులను అన్యాయం చేయడని, రాజధాని కోసం చేస్తున్న ఆందోళన విషయంలో శాంతించాలని రైతులను కోరారు.  పృథ్వీకి, తనకు ఎలాంటి విభేదాలు లేవు కానీ అయన మాట్లాడిన మాటలు మంచివి కావని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ కు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నానని పోసాని మీడియా ద్వారా తెలిపారు.