
ఏపీలో నంది అవార్డులపై సినీ నిర్మాత అశ్వినీ దత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అశ్వీనీదత్ చేసిన వ్యాఖ్యలపై పోసాని మురళీ కృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అని కాదు.. ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ లోఫర్, ఉత్తమ మోసగాడని మీ వాళ్లకే అవార్డులివ్వాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ వెదవలు, ఉత్తమ సన్యాసులని మీ వాళ్లకే అలాంటి అవార్డులు ఇవ్వాలన్నారు. సీఎం జగన్ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆయన అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతుందని.. రెండేళ్లు కరోనా రాగా దాని నుంచి ప్రజల్ని కాపాడుకున్నారని తెలిపారు. ఆ తర్వాత దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో వాటికి ఇచ్చారన్నారు.
రజీనీకాంత్ రోజు చెన్నై నుంచి విజయవాడ వచ్చి చంద్రబాబును పొగిడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు పోసాని. అతను చెన్నైలో సూపర్ స్టార్ అని.. తమకు చిరంజీవినే సూపర్ స్టార్అని అన్నారు. చిరంజీవికి జగన్ అంటే ఇష్టమని.. అలాగే చిరంజీవి అంటే జగన్.. వైఎస్సార్ కు ఇచ్చినంత గౌరవం ఇస్తారని చెప్పారు.
రాష్ట్రం విడిపోయాక రెండు తెలుగు రాష్ట్రాల్లో నంది అవార్డులు ఇవ్వడం ఆపేశారు. అయితే ఇరు రాష్ట్రాలు నంది అవార్డులివ్వకపోవడాన్ని అశ్వినీదత్ తప్పుబట్టారు. దివంగత నటుడు కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు మూవీని 4కేలో మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత ఆదిశేషగిరి రావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న అశ్వినీదత్ .. ప్రస్తుతం ఏపీలో ఉన్న సీజన్ వేరని.. ఇపుడు ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అవార్డులు ఇస్తారని అన్నారు. ఇంకా రెండుమూడేళ్లలో మళ్లీ అవార్డులు ఇచ్చే రోజులు వస్తాయని అపుడు అందరికీ అవార్డులు వస్తాయని వ్యాఖ్యానించారు. ఇవి కాస్త వివాదాస్పదంగా మారడంతో పోసాని కౌంటర్ ఇచ్చారు.