రాష్ట్రానికి పోషణ్​ అభియాన్ అవార్డులు

రాష్ట్రానికి పోషణ్​ అభియాన్ అవార్డులు
  • బెస్ట్ జిల్లాగా సంగారెడ్డి

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘పోషణ్ అభియాన్ అవార్డు’ల కార్యక్రమంలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో రెండు, క్షేత్ర స్థాయిలో రెండు అవార్డులు దక్కాయి. పోషణ్ ​అభియాన్ పథకాన్ని పక్కాగా అమలు చేసినందుకు జిల్లా లెవల్ లీడర్ షిప్, కన్వర్జెన్స్ విభాగంలో రాష్ట్రం నుంచి  సంగారెడ్డి జిల్లా ఎంపిక కాగా, బ్లాక్ లెవల్ విభాగంలో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ఎంపికైంది.

సంగారెడ్డి కలెక్టర్ హనుమంత రావు, జిల్లా అధికారులు వెంకటేశ్వర్లు, మోజిరాం రాథోడ్, ఎన్ మోతి, శ్రీనివాస రావు, గాయత్రి .. శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. బ్లాక్ లెవల్ విభాగంలో శాంతి శ్రీ, భీమా నాయక్, విద్యాధరి, వెంకటేశ్ రెడ్డి లు అవార్డులు దక్కించుకున్నారు.

వ్యక్తి గత విభాగాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఢాబా కె, మేడ్చల్ జిల్లా కు చెందిన అంకిరెడ్డి పల్లె గ్రామాల అంగన్ వాడీలు, ఆశా వర్కర్లు , ఏఎన్ఎం, ఏడబ్ల్యూహెచ్ లు మరుబాయి, అంజనా బాయి, మెర్రాం శ్రీదేవి, జంగుబాయి, భాగ్యలక్ష్మీ, కొల్కూరి భాగ్య, కొలుకూరి సాయిలత, తుంగ ఇంద్ర, అనిత, ఉన్నం అంజమ్మలు అవార్డుతో పాటు ₹ 50 వేల నగదు పురస్కారం అందుకున్నారు. అవార్డుల అందుకున్న తర్వాత సంగారెడ్డి కలెక్టర్ హనుమంత రావు మీడియా తో మాట్లాడారు.

జాతీయ స్థాయి అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్న ఆయన.. అంగన్ వాడీలు, ఆశా వర్కర్లు క్షేత్ర స్థాయిలో పోషక ఆహారాన్ని చిన్నారులకు, గర్భిణీలకు అందించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. రక్షహీనతతో బాదపడుతున్న 3,550 మంది పిల్లలకు సరైన టైంలో మందులు అందించి సమస్య నుంచి వారిని విముక్తి చేశామని శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారిణి శాంతి శ్రీ చెప్పారు.