సామాజిక న్యాయం అన్నందుకే బయటకు పంపిన్రు..ధైర్యంగా నా దారి నేను వెతుక్కుంటున్నా: కవిత

సామాజిక న్యాయం అన్నందుకే బయటకు పంపిన్రు..ధైర్యంగా నా దారి నేను వెతుక్కుంటున్నా: కవిత
  • సీఆర్​ అనే చెట్టు చుట్టూ దుర్మార్గులున్నరని కామెంట్​
  • 25 నుంచి జాగృతి జనంబాట కార్యక్రమం
  • పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు: సామాజిక తెలంగాణ అని అన్నందుకే కొందరు కుట్రలు చేసి తనను బీఆర్ఎస్ ​నుంచి బయటకు పంపించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్​ నుంచి ఎంపీగా గెలిచినప్పుడు కేసీఆర్​ ఫొటో పెట్టుకున్నానని, అప్పుడు పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేశానని చెప్పారు. కానీ, ఇప్పుడు పార్టీ నుంచి తనను సస్పెండ్​ చేశారని, అలాంటప్పుడు కేసీఆర్​ ఫొటో ఎందుకు పెట్టుకోవాలని  ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరుల బలిదానాలు ఎందుకు జరిగాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ తెచ్చుకొని అందరూ బాగుండాలనే వారు ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు.

 అమరుల ఆశయమైన సామాజిక తెలంగాణ సాధించడమే లక్ష్యంగా ‘జాగృతి జనం బాట’ యాత్ర చేపడుతున్నట్టు చెప్పారు. కేసీఆర్​ ఫొటో లేకుండానే ఈ యాత్ర చేస్తానని స్పష్టం చేశారు. బుధవారం బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని జాగృతి ఆఫీసులో ‘జనంబాట యాత్ర’ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భౌగోళిక తెలంగాణ వచ్చినా.. సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సి ఉందని చెప్పానని, అందులో తప్పేముందని ప్రశ్నించారు.  కేసీఆర్​అనే చెట్టు చుట్టూ దుర్మార్గులున్నారని, తాను ఆ చెట్టు కింద ఉన్నన్నాళ్లూ దాన్ని కాపాడుకున్నానని చెప్పారు.

 ‘‘కేసీఆర్​ ఓ పార్టీకి అధ్యక్షుడు. ఇప్పుడు నన్ను ఆ పార్టీ నుంచి సస్పెండ్​ చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి నేను కూడా రాజీనామా చేశాను. ఇలాంటి సమయంలో కేసీఆర్​ ఫొటో పెట్టడం సరికాదు. నైతికంగా సరికాదన్న ఉద్దేశంతోనే జనంబాట కార్యక్రమం పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేసీఆర్​ ఫొటో పెట్టట్లేదు. కేసీఆర్​ కూతురిగా పుట్టడం నా అదృష్టం. ఆయన్ను అగౌరవపరిచే పని ఏదీ చేయను’’ అని వ్యాఖ్యానించారు.

జాగృతిని బలోపేతం చేస్తం

రాష్ట్రంలో రాజకీయంగా స్పేస్​ ఉందో.. లేదో.. తనకు తెలియదని కవిత అన్నారు. అందుకే ప్రజలనే అడిగి వారు చెప్పినట్టే చేస్తామని, ప్రతి జిల్లాలోనూ రెండు రోజులు ఉంటామని చెప్పారు. ఈ నెల 25 నుంచి ‘జాగృతి జనంబాట’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమం చేస్తూనే..  సమస్యలపైనా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అదే సమయంలో జాగృతిని పటిష్టం చేసుకుంటామని చెప్పారు.  గతంలో మా సంస్థ పటిష్టంగానే ఉండేదని, కానీ..  కేసీఆర్  చెప్పారని  కొన్ని కార్యక్రమాలు ఆపేసినట్టు వెల్లడించారు.