కోడ్​ ముగియగానే కమిషన్, కార్పొరేషన్​ పదవులు

కోడ్​ ముగియగానే కమిషన్, కార్పొరేషన్​ పదవులు
  • కనీసం 15 నుంచి 20 నామినేటెడ్ చైర్మన్ల నియామకంపై సీఎం రేవంత్ దృష్టి
  • విద్య, వ్యవసాయం.. ఇక కమిషన్లుగా మార్పు
  • ఎడ్యుకేషన్​కు ఆకునూరి మురళి, అగ్రికల్చర్​కు కోదండరెడ్డి పేర్ల పరిశీలన
  • రాష్ట్ర మంత్రులు, డీసీసీల నుంచి సీఎంకు చేరిన సీనియర్ నేతల పేర్లు
  • లోక్​సభ, అసెంబ్లీ టికెట్లను త్యాగం చేసిన వారికి  ప్రయార్టీ 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పలు కీలకమైన కార్పొరేషన్లు, కమిషన్లకు చైర్మన్లను నియమించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్​ పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 37 కార్పొరేషన్లు, మరికొన్ని కమిషన్లకు చైర్మన్లను  నియమించింది.  తాజాగా మరో 15 నుంచి 20  కార్పొరేషన్లతో పాటు కొన్ని కమిషన్లకు చైర్మన్లను నియమించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. మరో వారంలో ఈ నియామకాలను పూర్తి చేయాలనే పట్టుదలతో రేవంత్​ ఉన్నట్టు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. 

ఈ లోపు ఎలక్షన్ కోడ్ ( జూన్ 6 )  కూడా ముగియనుండడంతో ఆ వెంటనే ఆర్డర్ కాపీలను నేరుగా నేతలకు అందించనున్నారని తెలుపుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేసిన నాయకులకు ఈ నామినేటెడ్ పోస్టుల్లో టాప్ ప్రయార్టీ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో ఈ రెండు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులకు కూడా ఇందులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు మాత్రం నామినేటెడ్ పదవులు ఇవ్వొద్దని సీఎం నిర్ణయించినట్టు సమాచారం. పార్టీ నిబంధనల మేరకు వీరికి పదవులు ఇవ్వడం కుదరదని, తనను కలిసిన నాయకులకు రేవంత్ ఇప్పటికే స్పష్టం చేసినట్టు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. 

కీలక కార్పొరేషన్లన్నింటికీ చైర్మన్లు

ఆర్టీసీ, సివిల్ సప్లయ్, బేవరేజెస్, రెడ్కో ( రెన్యువబుల్​ఎనర్జీ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ), మూసీ రివర్ ఫ్రంట్, హుడా ( హైదరాబాద్ అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ ) వంటి కీలక కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడంపై సీఎం రేవంత్ దృష్టిపెట్టారు. వీటితో పాటు విద్య, వ్యవసాయ రంగాలకు ఈసారి కొత్తగా కమిషన్లు ఏర్పాటు చేసి, వాటికి అనుభవజ్ఞులైన వారిని చైర్మన్లుగా నియమించాలని భావిస్తున్నారు. విద్యకు, వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఇందులో కొన్ని సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించారు. 

ఇందులో భాగంగానే ఈ రెండు శాఖలకు కమిషన్లను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. విద్యా కమిషన్​కు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళిని, వ్యవసాయ కమిషన్ కు కాంగ్రెస్ సీనియర్ నేత, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డిని నియమించనున్నారు. త్వరలో జిల్లా, మండల, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరగనున్నందున వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ పదవుల పంపకంపై సీఎం ఫోకస్ పెట్టినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొదటి విడతలో చాలా మంది సీనియర్లకు నామినేటెడ్ తో పాటు ఎమ్మెల్సీ , రాజ్యసభ వంటి కీలక పదవులు దక్కాయి. అప్పుడు ఆ పదవులు దక్కని మరికొందరు సీనియర్లను ఇప్పుడు మొదటి ప్రాధాన్యతగా గుర్తించి ఈ పదవుల్లో నియమించనున్నారు.

హుడా, మూసీ రిఫర్​ ఫ్రంట్​కు చైర్మన్లు

కరీంనగర్, వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థలకు మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. ఇప్పుడు హైదరాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హుడా )కి చైర్మన్​ను నియమించాల్సి ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నందున ఇది కూడా చాలా కీలకమైన పదవే. అందుకే ఈ పదవికోసం గ్రేటర్ పరిధిలోని  పలు నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు పైరవీలు చేస్తున్నట్టు సమాచారం. ఈ పదవి ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ సిటీ నేతల్లో నెలకొంది. ఇక మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ పదవి కోసం కూడా గ్రేటర్ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. 

రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూసీ నది ప్రక్షాళన చేస్తామని ప్రకటించడంతోపాటు లండన్ లో పర్యటించి అక్కడ అధ్యయనం చేసి వచ్చారు. త్వరలోనే మూసీని ప్రక్షాళన చేయడంతో పాటు వందల కోట్లు ఖర్చు చేసి మూసీ పరీవాహక ప్రాంతాలను సుందరంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీంతో ఇప్పుడు మూసీ చైర్మన్ పదవి కూడా చాలా కీలకం కానుంది. ఎన్నికల కోడ్ ముగిసేలోపు నామినేటెడ్ నియామకాలను ఫైనల్​ చేసి, ఆ తర్వాత ఇక పూర్తిస్థాయిలో పాలనపై దృష్టి పెట్టేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు.

గాంధీ భవన్​కు చేరిన అర్హుల పేర్లు

పదవుల కోసం ఉమ్మడి జిల్లాల్లో అర్హులైన పలువురు నాయకుల పేర్లను ఆయా జిల్లాల నుంచి మంత్రులు, డీసీసీ అధ్యక్షులు గాంధీ భవన్​కు, సీఎంకు పంపించారు. ఒక్కో ఉమ్మడి జిల్లా నుంచి 10 నుంచి 15 మంది పేర్లు సీఎం వద్దకు చేరినట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాలవారీగా పార్టీ పదవుల్లో ఉన్న సీనియర్లను గుర్తించి, సామాజిక సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకొని వివిధ నామినేటెడ్ పోస్టుల్లో నియమించాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. ఇటు లోక్ సభ, అటు అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన చాలామంది సీనియర్ నేతలు కూడా ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. 

వారి చేరిక సమయంలో రేవంత్  ఆ మేరకు హామీ ఇచ్చారు. ఇప్పుడు వలస వచ్చిన నేతలు చాలా మంది తమకు ఇచ్చిన హామీని సీఎం దృష్టికి తీసుకెళ్లి, తమకు పదవి ఇవ్వాలని కోరుతున్నారు. మరి కొందరు నేతలు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జీ దీపాదాస్ మున్షీని కలిసి, తమకు నామినేటెడ్ పదవుల్లో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ లోని సీనియర్ నేతలతోపాటు బీఆర్ఎస్, బీజేపీలో బలమైన నేతలుగా ఉండి, కాంగ్రెస్ లో చేరిన వారికి కూడా తగిన గౌరవం,  గుర్తింపు ఇచ్చేలా  కీలక కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంపై రేవంత్ కసరత్తు చేస్తున్నారు. పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ జడ్పీ చైర్మన్లు, పీసీసీలో ముఖ్యమైన పదవుల్లో ఉన్న నాయకులు, డీసీసీ అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో పార్టీలో బలమైన నేతలు ఈ జాబితాలో ఉన్నారు.