
- సిద్దిపేట నుంచి ప్రజ్ఞాపూర్ వైపు దెబ్బతిన్న రోడ్డు
- తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత పనులు చేయాలని కోరుతున్న ప్రయాణికులు
సిద్దిపేట, వెలుగు: ఇటీవల కురిసిన వర్షాలకు సిద్దిపేట జిల్లా గుండా వెళ్లే రాజీవ్ రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. సిద్దిపేట నుంచి ప్రజ్ఞాపూర్ వరకు సాగే రోడ్డుపై 45 కిలో మీటర్లలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. శామీర్ పేట నుంచి మొదలై మంచిర్యాల వరకు 205 కిలోమీటర్ల మేర సాగే రాజీవ్ రహదారి సిద్దిపేట జిల్లాలో 90 కిలో మీటర్ల మేర కొనసాగుతోంది. ఈ రోడ్డు గుండా ప్రతి రోజు 40 వేలకు పైగా చిన్నా పెద్ద వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చే వాహనాలను, ఔటర్ రింగ్ రోడ్డును రాజీవ్ రహదారి కలుపుతుంటుంది.
సిద్దిపేట నుంచి ప్రజ్ఞాపూర్ వైపు మార్గంలో అత్యధికంగా గుంతలు ఏర్పడగా మిగిలిన దారిలో అక్కడక్కడ గుంతలు పడ్డాయి. ముఖ్యంగా సిద్దిపేట నుంచి ప్రజ్ఞాపూర్ వెళ్లే రహదారిపై హరిత హోటల్, నాగుల బండ, దుద్దెడ, తిమ్మారెడ్డిపల్లి, లకుడారం, కుకునూరుపల్లి, మేథీని పూర్, రామచంద్రాపూర్, కొడకండ్ల, రిమ్మనగూడ, ప్రజ్ఞాపూర్ పరిధిలో అనేక గుంతలు కనిపిస్తున్నాయి.
ప్యాచ్ వర్క్స్ చేసిన చోటే గుంతలు
కొంత కాలంగా రాజీవ్ రహదారిపై ఏర్పడ్డ గుంతలకు ప్యాచ్ వర్క్ చేసి వాటిని పూడ్చినా ఇటీవల కురిసిన వర్షాలకు వాటి సమీపంలోనే తారు లేచి మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. నాణ్యతా లోపాల కారణంగానే గుంతలు ఏర్పడుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. స్టేట్ హైవే కావడంతో వేగంగా ప్రయాణించే వాహనాలకు గుంతలు స్పీడ్ బ్రేకర్లుగా మారుతున్నాయని వాపోతున్నారు. ఏమాత్రం అదుపుతప్పినా ప్రమాదాల బారిన పడతామని డ్రైవర్లు పేర్కొంటున్నారు.
భారీ వాహనాల రాకపోకలు
మేడ్చల్ జిల్లా శామీర్ పేట నుంచి ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, శనిగరం, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి, బసంత్ నగర్, గోదావరిఖని మీదుగా జైపూర్ క్రాసింగ్ వరకు 205 కిలోమీటర్ల మేర సాగే రాజీవ్ రహదారి రద్దీగా ఉంటుంది. సిద్దిపేట జిల్లాలో కొన్ని రోజులుగా వర్షాలతో ఏర్పడ్డ గుంతలకు తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేశారు. ముఖ్యంగా సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గును, గోదావరిఖని నుంచి ఇసుక ను రవాణా చేసే భారీ వాహనాలతో పాటు ప్రైవేటు, ఆర్టీసీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన దుద్దెడ టోల్ గేట్ నుంచి ప్రతి రోజు దాదాపు నలభై వేలకు పైగా వివిధ రకాల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. భారీగా రాకపోకలు సాగే రాజీవ్ రహదారిపై తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత పనులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.