
తెలంగాణలో వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. కేవలం మంగళ, బుధ వారాల్లో (ఆగట్టు 26, 27) 24 గంటల లోపే వర్షాలు జలదిగ్బంధం చేశాయి. గ్రామాల్లో ఇండ్లలోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పంటలు చాలా వరకు నీళ్లలో మునిగిపోయాయి.
భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలం అయ్యింది. ఒక్కసారిగా వరదలు రావడంతో నిజాంపేట మండలంలోని నందిగామలో పౌల్ట్రీ ఫాం మునిగిపోయింది. బాబు అనే రైతుకు చెందిన పౌల్ట్రీ ఫాంలోకి వరద ఒక్కసారిగా పోటెత్తడంతో సుమారు 10 వేల కోళ్లు మృతి చెందాయి.
వరదలు రెండు ఫీట్లపైనే రావడంతో పౌల్ట్రీ ఫాం గోడపై నుంచి ఫాం లోకి నీళ్లు చేరుకున్నాయి. దీంతో కోళ్లు నీళ్లలో మునిగి గిలగిల కొట్టుకుని చనిపోయాయి. సుమారు రూ.14 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు పౌల్ట్రీ ఫారం యజమాని బాబు చెబుతున్నాడు.
మరోవైపు జిల్లాలో నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పంటపొలాలన్నీ మునిగిపోయాయి. రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. మెదక్ హవేలీ ఘనపూర్ మండలంలో నక్కవాగు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. వాగు ప్రవాహానికి రోడ్లు నదుల్లా మారిపోయాయి. భారీ వరదలో కారు కాగితం పడవలా కొట్టుకోవడం భయాందోళనకు గురి చేసింది. కారులో వాగులో చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.