
నాగర్కర్నూల్, వెలుగు: పేదరికంతో కొడుకును అమ్ముకోవడానికి సిద్ధపడ్డ చెంచు దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్ఇచ్చి పంపించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొల్ల చింతపల్లి గ్రామ పంచాయతీ పరిధి మెదరోని బండ చెంచుపెంటకు చెందిన బయన్నకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు పిల్లలు లేరు. రెండో భార్య బాలమ్మకు ముగ్గురు పిల్లలు. ఇటీవల బాలమ్మ మగ బిడ్డకు జన్మనిచ్చింది. తండ్రి బయన్న ముక్కిడిగుండానికి చెందిన మధ్యవర్తులు నాను, బాలయ్యతో మాట్లాడి పెద్దకొత్తపల్లి మండలం సాతపూర్ గ్రామానికి చెందినవారికి రూ.2 లక్షలకు బాబును అమ్మకానికి పెట్టాడు. విషయం బయటకు రావడంతో వారు బాబును తల్లిదండ్రుల వద్ద వదిలివెళ్లారు. అనంతరం కొల్లాపూర్పోలీసులు తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. శుక్రవారం ఐసీడీఎస్ సీడీపీఓ చెంచుపెంటకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.