ఎంజీఎంలో కరెంట్​ ‍లేక..పేషెంట్ల అవస్థలు

ఎంజీఎంలో కరెంట్​ ‍లేక..పేషెంట్ల అవస్థలు
  • ఎంజీఎంలో కరెంట్​ ‍లేక..పేషెంట్ల అవస్థలు
  • రాత్రిపూట ఎమర్జెన్సీ వార్డుల్లో కమ్ముకున్న చీకట్లు 
  • బెడ్లమీది రోగుల ఇబ్బందులు.. ఇంటోళ్ల ఏడుపులు
  • వెంటిలేటర్‍ ఆగిపోవడంతో పేషెంట్​  మృతి
  • కరెంట్ సమస్యతో చనిపోలేదంటున్న అధికారులు
  • రెండు గంటల తర్వాత కరెంటు పునరుద్ధరణ

వరంగల్‍, వెలుగు: ఉత్తర తెలంగాణలో పాణంబాగలేని జనానికి పెద్ద దిక్కుగా ఉండే వరంగల్‍ ఎంజీఎం దవాఖానా శుక్రవారం రాత్రి పేషెంట్లకు నరకం చూపింది. రాత్రి దాదాపు 9 గంటల టైమ్​కు ఒక్కసారిగా కరెంట్ నిలిచిపోవడంతో దవాఖానలో చీకట్లు అలుముకున్నాయి. ఎమర్జెన్సీ సర్వీస్‍ ఇచ్చే వెంటిలెటర్ల వార్డుల్లో ఊపిరాడక పేషెంట్లకు ప్రాణం పోయినంత పరిస్థితి వచ్చింది. తమవారి అవస్థ చూడలేక, ఏం చేయలేక ఇంటోళ్ల ఏడుపులు. ప్రాణంపోస్తదని నమ్ముకొని వచ్చిన పేదోళ్లను దాదాపు రెండు గంటలు ప్రాణం తీసినంత పనిచేసింది ఎంజీఎం. 

ఈ సమస్యతో ఓ పేషెంట్‍ కన్నుమూశాడు. అధికారులు మాత్రం అతను వేరే కారణాలతో మృతి చెందినట్లు చెప్తున్నారు. ఆసుపత్రిలో పవర్‍ కేబుల్స్ కాలిపోవడంతో ఏఎంసీ, బర్నింగ్‍, సర్జికల్‍ తదితర వార్డుల్లో విద్యుత్‍ అంతరాయం ఏర్పడింది. పేషేంట్ల అరుపులు, ఏడుపులతో సమాచారం అందుకున్న అధికారులు పరుగులు పెట్టారు. కొన్ని వెంటిలెటర్లు చార్జింగ్‍తో పనిచేయగా.. మరికొన్ని ఆగిపోవడంతో తలలు పట్టుకున్నారు. కరెంటు పునరుద్ధరణ కోసం ప్రయత్నించారు. అంతలోనే కొన్ని అంబులెన్స్​లు రావడంతో అక్కడ ఏంజరుగుతుందో అర్థమవక ఆగమాగమయ్యారు. దాదాపు రెండు గంటల తర్వాత ఎమర్జెన్సీ వార్డుల్లో కరెంట్‍ సరఫరా పునరుద్ధరించారు. సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు శనివారం ఉదయం నుంచి పనులు మొదలుపెట్టారు.

శ్వాస అందక పేషెంట్​ మృతి?

కరెంట్‍ పోయిన టైమ్​లో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స తీసుకుంటున్న వరంగల్‍ జిల్లా నర్సంపేట మండలం రాజేశ్వరపల్లికి చెందిన బొజ్జ భిక్షపతి మృతి చెందాడు. ఆయన మృతికి విద్యుత్‍ అంతరాయమే కారణమని ఆయన చిన్న అల్లుడు సోడ మల్లేశ్ తెలిపారు. భిక్షపతికి ఈనెల 28న ఇంటివద్ద రక్తపు వాంతులవడంతో నర్సంపేట ఏరియా హస్పిటల్​కు తరలించామన్నారు. కండీషన్ క్రిటికల్​గా ఉండటంతో డాక్టర్లు వరంగల్‍ ఎంజీఎంకు రెఫర్‍ చేశారని చెప్పారు. అక్కడ వెంటి లెటర్‍ మీద ఎమర్జెన్సీ చికిత్స అందిస్తున్నా రని తెలిపారు. 29న ఎంజీఎంలో రాత్రి కరెంట్‍ పోవడంతో అతనికి శ్వాస ఇబ్బంది అయింది. గంటపాటు అవస్థపడ్డ భిక్షపతి ఆ తర్వాత కన్నుమూశాడని చెప్పారు.