Tata Trust Issue: టాటా ట్రస్టుల్లో ముదిరిన అంతర్గత విభేదాలు.. మెహ్లీ మిస్త్రీ ఔట్..!

Tata Trust Issue: టాటా ట్రస్టుల్లో ముదిరిన అంతర్గత విభేదాలు.. మెహ్లీ మిస్త్రీ ఔట్..!

Mehli Mistry Voted Out: టాటా ట్రస్టుల చైర్మన్ నోయెల్ టాటా నేతృత్వంలోని కీలక సమావేశంలో ట్రస్టీలు వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్‌లు.. మెహ్లీ మిస్త్రీని జీవితకాల ట్రస్టీగా తిరిగి నియమించడాన్ని వ్యతిరేకించారు. ఈ నిర్ణయంతో టాటా గ్రూప్‌ ప్రధాన హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌పై నియంత్రణ ట్రస్టులో అంతర్గత విభేదాలు మరింత తారా స్థాయికి చేరాయి. రతన్ టాటా మరణం తర్వాత నోయెల్ టాటా బాధ్యతలు చేపట్టాక 156 ఏళ్ల వ్యాపార దిగ్గజాన్ని నడిపిస్తున్న టాటా ట్రస్టుల్లో విభేదాలు బయటపడ్డాయి. 

ప్రస్తుతం సాల్ట్ టు సాఫ్ట్‌వేర్ వరకు అనేక వ్యాపారాలు కలిగి ఉన్న టాటా సన్స్‌లో.. టాటా ట్రస్ట్స్ 66 శాతం వాటాను హోల్డ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా నిర్ణయం ట్రస్ట్ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు. నోయెల్ టాటా నేతృత్వంలోని ఒక వర్గం.. అలాగే మెహ్లీ మిస్త్రీకి మద్దతుగా ఉన్న మరో వర్గం మధ్య అంతర్గతంగా గేమ్ కొనసాగుతోంది.

ALSO READ : క్రిప్టో కరెన్సీలు చట్ట ప్రకారం ఆస్తేనా..

తాజాగా మంగళవారం జరిగిన ట్రస్టీల సమావేశంలో వేణు శ్రీనివాసన్ (టీవీఎస్ మోటర్ మాజీ చైర్మన్), మాజీ రక్షణ కార్యదర్శి విజయ్ సింగ్‌లు, సైరస్ మిస్త్రీని మూడు సంవత్సరాల పదవీకాలం అనంతరం తిరిగి నియమించడాన్ని వ్యతిరేకించారు. అయితే ప్రమిత్ ఝావేరి, దారియస్ ఖాంభాటా, జెహంగీర్ హెచ్‌సి జెహంగీర్‌లు మిస్త్రీ పునర్నియామకానికి మద్దతు ఇచ్చారు. సెప్టెంబరులో మెుదలైన టెన్షన్.. అప్పుడు మిస్త్రీ వర్గం విజయ్ సింగ్‌ను టాటా సన్స్ బోర్డు నుంచి తొలగించేందుకు ఓటు వేసింది. అయినప్పటికీ గత వారంలో వేణు శ్రీనివాసన్‌ని జీవితకాల ట్రస్టీగా ఏకగ్రీవంగా నియమించడం ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ ఓటింగ్ నిర్ణయంపై మెహ్లీ మిస్త్రీ ఇంకా స్పందించలేదు. కానీ ఆయన దీన్ని కోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024 అక్టోబర్ 17న రతన్ టాటా మరణం తర్వాత పాస్ చేసిన ఒక తీర్మానం ప్రకారం.. అన్ని ట్రస్టీలను శాశ్వత ట్రస్టీలుగా నియమించాలనే నిబంధన ఉందని ఆయన వాదించవచ్చని సమాచారం. ప్రస్తుతం సర్ రతన్ టాటా ట్రస్టు, సర్ దోరబ్జి టాటా ట్రస్టు వంటి కీలక సంస్థల ట్రస్టీలలో కూడా ఈ ఇద్దరి వర్గాల మధ్య పోటీ కొనసాగుతోంది. ఈ అంతర్గత విభజనలు భారతదేశంలో అత్యంత ప్రముఖ ఫిలాంత్రోపిక్ సంస్థగా ఉన్న టాటా ట్రస్టుల భవిష్యత్తుపై దేశ ప్రజలతో పాటు ఇన్వెస్టర్లలో కూడా ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.