చత్తీస్​గఢ్​ పవర్ తో మన డిస్కంలకు రూ.261 కోట్లు లాస్

చత్తీస్​గఢ్​ పవర్ తో మన డిస్కంలకు రూ.261 కోట్లు లాస్

హైదరాబాద్, వెలుగుచత్తీస్​గఢ్​ పవర్  మన రాష్ట్ర డిస్కంలకు మరో షాక్​ ఇచ్చింది. దాన్ని ఎక్కువ రేటుకు కొనడంతోపాటు, రాష్ట్రానికి తెచ్చుకునేందుకు చేసిన హడావుడి కొంప ముంచింది. విద్యుత్​ (లైన్)​ కారిడార్​ కోసం ఆగమాగం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు డిస్కంల మెడకు చుట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు చర్యల కారణంగా  పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​కు  రూ. 261 కోట్ల పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కరెంటు కోతల సమస్య నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఎక్కడపడితే అక్కడ ఎడాపెడా పవర్​ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. ఇందులో భాగంగా చత్తీస్​గఢ్​లోని మార్వా థర్మల్​ విద్యుత్​ కేంద్రం నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్​ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. తెలంగాణ, చత్తీస్‌‌గఢ్‌‌  సీఎంల మధ్య  ఎంవోయూ జరిగింది. చత్తీస్‌‌గఢ్‌‌ నుంచి మరో 1,000 మెగావాట్లను కొనుగోలు చేస్తామని అప్పట్లో సీఎం  కేసీఆర్‌‌ ప్రకటించారు.

అప్పటివరకు చత్తీస్‌‌గఢ్‌‌  పవర్​ రాష్ట్రానికి వచ్చే మార్గం లేదు.  రెండు రాష్ట్రాలను లింక్​ చేసే  విద్యుత్‌‌ కారిడార్‌‌ లేదు. ఆ టైంలో ఈస్టర్న్​, నార్తర్న్​, సదరన్​ రీజియన్​కు లింక్​చేసే  వార్ధా‌‌‌‌–నిజామాబాద్​ 765 కేవీ డబుల్​ సర్క్యూట్​ పవర్​ ట్రాన్సిమిషన్  లైన్​ను పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్  నిర్మిస్తోంది. ఈ కారిడార్​ కెపాసిటీ 4,200 మెగావాట్లు. అందులో వెయ్యి మెగావాట్ల కారిడార్​ తెలంగాణ అడ్వాన్సుగా బుక్‌‌ చేసుకుంది. చత్తీస్‌‌గఢ్‌‌  నుంచి మరో 1,000 మెగావాట్ల విద్యుత్‌‌ కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్​ తీసుకున్న నిర్ణయం మేరకు మరో వెయ్యి మెగావాట్ల కారిడార్‌‌ను ఆ తర్వాతి కాలంలో బుక్‌‌ చేసుకుంది. 2017 మార్చి చివర్లో కారిడార్​నిర్మాణం పూర్తయింది. అప్పట్నుంచీ ఈ కారిడార్​ను వినియోగించుకొని చత్తీస్​గఢ్​ పవర్​ను తెలంగాణకు తెచ్చుకునే  లైన్​ క్లియరైంది. తొలి ఎంవోయూ మేరకు 1,000 మెగావాట్ల విద్యుత్​ కోటాలో కొంత మొత్తాన్ని అవసరమైనప్పుడు డిస్కం వినియోగించుకుంటోంది. రెండో విడత వెయ్యి మెగావాట్ల పవర్​ వాడుకునేందుకు అడ్వాన్స్​గానే పవర్​ గ్రిడ్​ కారిడార్​ ను బుక్​ చేసుకుంది. ఇప్పటికీ అందులో ఒక్క వాట్​ విద్యుత్​ను కూడా వాడుకోలేదు. ఒప్పందం ప్రకారం ఆ రెండో వెయ్యి  మెగావాట్ల లైన్లను 2018 ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ రాష్ట్రం వినియోగించుకోవాలి. కానీ ఇప్పటికీ ఒక్క యూనిట్​కూడా ఈ లైన్ల ద్వారా తెచ్చుకోలేదు. ఇది తమకు అవసరం లేదని, ఈ కారిడార్​ను వదులుకుంటామని అదే ఏడాది ఫిబ్రవరి 19న పవర్‌‌ గ్రిడ్‌‌ కార్పొరేషన్‌‌కు డిస్కంలు లెటర్​ రాశాయి. కానీ ఒకసారి లైన్లను బుక్‌‌ చేసుకున్న తర్వాత..  వదులుకుంటే నిర్మాణానికి రూ. వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన పవర్‌‌ గ్రిడ్‌‌ నష్టపోతుంది.

ఈ నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని పవర్‌‌ గ్రిడ్‌‌ ఒప్పందంలో ఉంది. దీంతో  కేంద్ర విద్యుత్‌‌ నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం టీఎస్‌‌ఎస్పీడీసీఎల్‌‌ నుంచి తమకు రూ. 261 కోట్ల పరిహారం రావాలని పవర్​ గ్రిడ్​ లెక్కగట్టింది. మొత్తం12 ఏండ్ల కాలానికి సంబంధించిన 66 శాతం ట్రాన్స్‌‌మిషన్‌‌ చార్జీలు, నోటీసు చార్జీలు ఇందులో ఉన్నాయి. తొందరపాటుతో విద్యుత్‌‌ కారిడార్లను బుక్‌‌ చేసినందుకు డిస్కంలు ఈ భారీ పరిహారం చెల్లించాల్సి వచ్చింది.  ఒప్పందం ప్రకారం తమకు చార్జీలు చెల్లించాలని పవర్​ గ్రిడ్​ ఇప్పటికే డిస్కంలకు నోటీసులు ఇచ్చింది. అందులో రూ. 261 కోట్లు తమకు పరిహారంగా రావాలని  లెక్క తేల్చింది. దీంతో సదరన్​ డిస్కంకు పవర్​ గ్రిడ్​ ఇచ్చిన నోటీసుల షాక్​ తగిలినట్లయింది. తొందరపాటుతో కారిడార్​ను అడ్వాన్స్​గా బుక్​ చేసుకోవటంతో కోట్లల్లో పెనాల్టీ చెల్లించాల్సి రావటం అదనంగా భారంగా మారినట్లయింది. అక్కరలేని కారిడార్​కు భారీగా డిస్కంలు మూల్యం చెల్లించినట్లయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ కరెంటు చార్జీల రూపంలో ఈ పెనాల్టీని మళ్లీ జనంపై రుద్ది.. చార్జీల భారం మోపుతారనే వాదనలు వినిపిస్తున్నాయి.