- సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో ఆకట్టుకున్న ఎగ్జిబిట్స్
- రెండో రోజు ఫెయిర్‌కు వేలాది మంది
- ఈ నెల 23 వరకు కొల్లూర్ గాడియం స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన
అతి తక్కువ ఖర్చుతో వ్యవసాయ రంగంలో ఉపయోగించే డ్రోన్‌ను తయారు చేశాడు పాండిచ్చేరికి చెందిన టీచర్ వీరమణి ఖండన్. తక్కువ బరువు, ఎక్కువ దృఢంగా ఉండే విండ్ బ్లేడ్ ఉపయోగించి ట్రాన్స్ మీటర్ రిసీవర్ సహకారంతో మోటార్లకు కనెక్ట్ చేసే పద్ధతిని ఆయన కనుగొన్నారు.
హై టార్క్ రిలీజ్ చేసేలా 5200 ఎంఏహెచ్ బ్యాటరీలను రొటేషన్ సిస్టమ్ ద్వారా కనెక్ట్ చేసి డ్రోన్ ఎగిరేలా చేశాడు. ఇందులో ఆలో పైలట్ విధానం కూడా ఉందని నిర్దేశిత పొలం, ఏరియాను, పంటను సెలెక్ట్ చేసి రైతులు ఎక్కడి నుంచైనా ఈ డ్రోన్‌ను యాప్ ద్వారా ఆపరేట్ చేయవచ్చని వివరించారు.
వృథాగా పోయే టాయిలెట్ వాటర్ నుంచి కరెంట్ తయారు చేసే పద్దతిని తమిళనాడుకు చెందిన ధానుశ్రీ అనే స్టూడెంట్ ప్రదర్శించి శభాష్ అనిపించుకుంది. యూరిన్ పవర్ జనరేషన్ సిస్టమ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిట్ ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది.
ప్రత్యేకంగా అమర్చిన యూరినల్ టబ్స్కి కాపర్, అల్యూమినియం ఎలక్ర్టోడ్స్తో రియాక్షన్ జరిపించి పవర్ జనరేట్ చేసే టెక్నాలజీని ధానుశ్రీ ప్రదర్శించింది. కరెంట్ ప్రొడక్షన్ తరువాత అదే నీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి, గార్డెనింగ్, నిర్మాణ పనులకు వినియోగించవచ్చని వివరించింది.
రామచంద్రాపురం, వెలుగు: వృథాగా పోయే టాయిలెట్ వాటర్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే.. వెయ్యి, రెండు వేల ఖర్చుతో అగ్రికల్చర్ డ్రోన్ తయారు చేయగలిగితే.. స్మోక్ అండ్ హీట్ సెన్సర్ తో బస్సుల్లో ఫైర్ యాక్సిడెంట్లు నివారించగలిగితే.. ఇలా మరెన్నో ఆలోచనలకు విద్యార్థులు ఆచరణ రూపమిచ్చారు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్ గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం ప్రారంభమైన సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శనకు ఉంచిన ఎగ్జిబిట్స్సందర్శకులను ఆకట్టుకున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు 223 ఎగ్జిబిట్లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.
ఇందులో 55 గ్రూపు ప్రాజెక్టులు కాగా, 85 వ్యక్తిగత, 59 టీచర్స్ ఎగ్జిబిట్స్, మరో 24 ఎన్జీవోలకు సంబంధించినవి ఉన్నాయి. సోమవారం ఫెయిర్ అట్టహాసంగా ప్రారంభం కాగా, మంగళవారం వివిధ జిల్లాల నుంచి స్టూడెంట్లు ఫెయర్చూసేందుకు తరలివస్తున్నారు.
రోజుకు 4 వేల మంది విద్యార్థులు తిలకించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 23 వరకు ప్రదర్శన కొనసాగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
కర్నూలు బస్ ప్రమాదంతో చలించి..
ఇటీవల కర్నూల్లో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవడంతో చలించిన ఆంధ్రప్రదేశ్ ఏలూరుకు చెందిన విద్యార్ధులు అలాంటి ప్రమాదాల నివారణకు మార్గాన్ని కనుగొన్నారు. జడ్పీహెచ్ఎస్లో తొమ్మిదో తరగతి చదువుతున్న గాయత్రి, శరణ్య స్మోక్ అండ్ హీట్ సెన్సర్ పరికాన్ని కనిపెట్టారు.
బస్సుల్లో, కార్లలో ఈ సెన్సర్ అమర్చితే ప్రమాదాలు జరిగినప్పుడు అలారంతోపాటు ఎమర్జన్సీ డోర్లు తెరుచుకుంటాయని ప్రయోగాత్మకంగా వివరించారు.
ఈజీగా స్పేస్ వ్యర్థాల సేకరణ
అంతరిక్షంలో పేరుకుపోయిన వ్యర్థాలను సులభంగా ఎలా సేకరించవచ్చో తెలంగాణకు చెందిన స్టూడెంట్ ప్రదర్శించాడు. మెదక్ సిద్ధార్ధ రూరల్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న అక్షయ్ ఎలక్ర్టో మ్యాగ్నటిక్ పద్ధతి ద్వారా స్పేస్ డెబ్రీస్‌ను సేకరించే విధానాన్ని ప్రదర్శించాడు.
నాసా లాంటి సంస్థలు పెద్ద సైజు వ్యర్ధాలను మాత్రమే తొలగించే టెక్నాలజీ కలిగిఉందని, కానీ అంతరిక్షంలో ఉన్న ఎన్నో మెట్రిక్ టన్నుల సూక్ష్మ వ్యర్ధాలను తాను కనిపెట్టిన పద్ధతి ద్వారా క్లీన్ చేయొచ్చని అక్షయ్ వివరించాడు. అలాగే వాటిని సముద్రంలో డిస్పోస్ చేసే విధంగా ఓ సిస్టమ్ డెవలప్ చేసినట్లు తెలిపాడు.
స్మార్ట్ ఇంటెలిజెన్స్ ఫార్మింగ్ సిస్టమ్
భవిష్యత్తులో సంప్రదాయ వ్యవసాయం స్థానంలో కొత్త పద్దతులు అవసరమని పుదుచ్చేరికి చెందిన విద్యార్ధులు వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. స్టూడెంట్స్ జాహ్నవి, సాధిక సోలార్, విండ్ ఎనర్జీలను ఉపయోగించి కొత్త తరహా వ్యవసాయం ఎలా చేయొచ్చో చూపించారు. ఏరో బాండింగ్ న్యూట్రియన్స్ వాటర్‌ను ఉపయోగించి ఫోటో సింథసిస్, ఆర్టిఫిషియల్ హీట్ సిస్టమ్ లాంటి పద్దతులతో తక్కువ నీటిని ఉపయోగించి లాభసాటి వ్యవసాయం చేయడం, వ్యవసాయ క్షేత్రాలను, పంటలను, ఆక్వా కల్చర్‌ను జంతువుల నుంచి కాపాడుకునే పద్దతులను ప్రదర్శించారు.
