సోషల్ మీడియానా మజాకా: వృద్ధ దంపతులను ఆదుకున్న ఒకే ఒక్క పోస్ట్

సోషల్ మీడియానా మజాకా: వృద్ధ దంపతులను ఆదుకున్న ఒకే ఒక్క పోస్ట్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అందరి జీవితాలపై ప్రభావం చూపించింది. ఈ విపత్తు కారణంగా రోజు గడవని దుస్థితికి చేరుకున్న వీధి వర్తకులు ఎందరో ఉన్నారు. ఈ వీడియోలో ఉన్న ఓ వృద్ధ వీధి వర్తకుల జంట పరిస్థితి కూడా అలాంటిదే. అయితే వీరిని ఆదుకోవడానికి చాలా మంది ముందుకు రావడం విశేషం. సోషల్ మీడియాను మంచి కోసం ఎలా ఉపయోగించుకోవచ్చనే దానికి దీన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. వివరాలు.. ఢిల్లీలో ఉండే ఓ పెద్దాయన తన భార్యతో కలసి బాబా కా ధాబా పేరుతో చిన్న హోటల్‌‌ను నడిపిస్తున్నాడు. కరోనా కారణంగా చాలా మందిలాగే ఆయన వ్యాపారానికి దెబ్బ పడింది. దీంతో వారికి రోజు గడవడమే ఇబ్బందిగా మారింది. వీరి స్టోరీని ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

బెస్ట్ మటర్ పన్నీర్ అమ్మే 80 ఏళ్ల ఈ వృద్ధ దంపతులకు హెల్ప్ చేయడానికి బాబా ధాబాకు రండి అని వాసన్ చేసిన పోస్ట్ వీడియోకు అనూహ్య స్పందన వచ్చింది. బాబా కా ధాబా అనే హ్యాష్ ట్యాగ్‌‌తో చాలా మంది నెటిజన్స్ ఈ పోస్ట్‌‌ను షేర్ చేస్తున్నారు. వీడియోలో వృద్ధ దంపుతులు తమ బాధలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడం అందర్నీ కలచి వేసింది. దీనికి చలించిన సెలబ్రిటీలు ఈ వార్తను షేర్ చేస్తున్నారు. మీరు ఢిల్లీలో ఉంటే బాబా కా ధాబాను విజిట్ చేయండంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌‌దీప్ హుడా ట్వీట్ చేయడం విశేషం. సోషల్ మీడియాలో బాబా కా ధాబా గురించి పెద్ద ఎత్తున షేర్‌‌లు, పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది అక్కడికి వెళ్లి బాబా వండిన భోజనాన్ని తింటూ పోస్టులు పెడుతున్నారు. ఒకే ఒక్క పోస్టుతో బాబా కా ధాబాకు జనాలు క్యూ కడుతున్నారు.