నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ లో కరెంటు లేక రోగుల తిప్పలు

నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ లో కరెంటు లేక రోగుల తిప్పలు

అది పేరుకే పెద్ద హాస్పిటల్. జిల్లా కేంద్రంలోని ఆ దవాఖానాకు…. రోజూ వందల మంది రోగులు వస్తుంటారు. ఓపీలతో పాటు ఆపరేషన్లు కూడా పెద్ద సంఖ్యలోనే జరుగుతుంటాయి. ఇలాంటి హాస్పిటల్లో కరెంట్ సమస్య రోగులను ఇబ్బందులు పెడుతోంది. నిజామాబాద్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చేవారు కరెంట్ కష్టాలతో అరిఘోస పడుతున్నారు..

కరెంట్ కోతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో హాస్పిటల్ సూపరింటెండెంట్  సెలవులో ఉండటంతో పాలన గాడి తప్పింది. హాస్పిటల్ విద్యుత్ సరఫరాలో అంతరాయం రావడంతో… ప్రసూతి, బాలింతలు, శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న వారి వార్డుల్లో ఫ్యాన్లు పని చేయటంలేదు. ఉక్కపోతతో చంటి పిల్లలు గుక్క పెట్టి ఏడుస్తున్నారు. ఎండవేడితో బాలింతలు అల్లాడిపోతున్నారు. ఆపరేషన్ నొప్పులకు తోడు ఎండ వేడి, ఉక్కపోతతో మరిన్ని ఇబ్బందులు పడుతున్నామంటున్నారు మహిళలు.

ప్రసూతి వార్డుల్లో 25 నుంచి 30 మంది బాలింతలు ఉంటారు. ఒక్కొక్కరికి ఇద్దరు లేదా ముగ్గురు సహాయకులుగా ఉంటున్నారు. దీంతో వార్డులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. బయటి నుంచి గాలి, దుమ్ము, ధూళి రాకుండా బాలింతల వార్డుల్లోని కిటీకీలు మూసేశారు. కొన్ని చోట్ల ఏసీలున్నా అవి పని చేయకపోవటం లేదంటున్నారు రోగులు. చెడిపోయిన ఏసీలు బాగు చేసేందుకు నిధులు లేవని సిబ్బంది చెబుతున్నారని అంటున్నారు పేషెంట్ల అటెండెంట్లు. ఇక ఉన్నవి వాడితే కరెంట్ బిల్లు తడసిమోపెడవుతుందని.. వాటిని వాడటం లేదని చెబుతున్నారు. దీంతో ఇబ్బందులు తప్పటంలేదంటున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కరెంట్ సమస్య తీర్చాలని కోరుతున్నారు రోగులు, వారి బంధువులు. పనిచేయని ఏసీలు బాగు చేయించాలంటున్నారు.