తెలంగాణ డిజిటల్ విప్లవంలో సరికొత్త అధ్యాయం

తెలంగాణ  డిజిటల్ విప్లవంలో సరికొత్త అధ్యాయం

‘డిజిటల్ విప్లవం’లో  తెలంగాణ మరో అడుగు ముందుకేసింది.  సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్ హబ్’గా  తెలంగాణ మారుతోంది. దేశంలోనే  తొలిసారిగా ఏఐ ఆధారిత ‘తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్(టీజీడెక్స్)’ను  లాంఛనంగా  ప్రారంభించి ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్​గా నిలిచింది.  

ఏఐ ఒక ఎమర్జింగ్ టెక్నాలజీగా కాదు. మానవ దైనందిన జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే శక్తిగా మారుతోంది.  ప్రస్తుతం  సమాజం  ఎదుర్కొంటున్న ఎన్నో  సమస్యలకు పరిష్కారం చూపే సత్తా దీనికి ఉంది.  ఒక  సమస్యకు  సంబంధించిన డేటాను సేకరించి... విశ్లేషించి.. ఏఐ ఆధారిత పరిష్కార నమూనాను  రూపొందించడం ఖర్చుతో కూడుకున్నది.  పైగా.. సంక్లిష్టమైన ప్రక్రియ. ముఖ్యంగా కావాల్సిన కచ్చితత్వమైన డేటా అందరికీ అందుబాటులో ఉండదు. ఇది చిన్న  స్టార్టప్స్, గ్రామీణ ప్రాంతాల్లోని ఔత్సాహిక ఆవిష్కర్తలకు అతిపెద్ద సవాలు.

‘తెలంగాణ ఏఐ స్ట్రాటజీ అండ్​ రోడ్ మ్యాప్’లో భాగంగా ఈ అంతరాన్ని పూడ్చేందుకు సురక్షితమైన ఏఐ రెడీ డేటా, కంప్యూటింగ్ పవర్, ఓపెన్ – రిసోర్స్ టూల్స్​ను అందరికీ అందుబాటులోకి తేవాలని మంత్రి శ్రీధర్ బాబు సంకల్పించారు.  ఆయన  నాయకత్వంలో  జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(జైకా) సహకారంతో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్(ఐటీఈఅండ్ సీ) విభాగం ‘టీజీడెక్స్(tgdex.telangana.gov.in)’ పేరిట డిజిటల్ పబ్లిక్  ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ను  రూపొందించింది.  బెంగళూరు ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్  వ్యూహాత్మక సహకారం అందించింది. ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాదు, ‘ప్రతిభ ఎక్కడున్నా వెలికి తీయాలి’ అనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం. 

 సమాజానికి ఉపయోగమేంటి?

ఆవిష్కరణలు కేవలం హైదరాబాద్ లాంటి మహా నగరానికే పరిమితం కావొద్దు.  టైర్ – 2,  టైర్ – 3 నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆ దిశగా అడుగులు పడాలి. అందుకు అవసరమైన ఏఐ సాంకేతికతను ఈ టీజీడెక్స్ అందిస్తుంది. ఉదాహరణకు  ఓ యువకుడు రైతులకు మేలు కలిగేలా ఏఐ సాయంతో పంట దిగుబడిని ముందే అంచనావేసే యాప్ లేదా చీడపీడలను ముందే పసిగట్టే యాప్ / సాధనాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పిస్తాడు.  ఈ  టీజీడెక్స్ అతనికి అవసరమైన కచ్చితత్వమైన వ్యవసాయ డేటా  (నేల రకం, వాతావరణ సమాచారం, పంట దిగుబడి తదితరాలు), ఏఐ ఆధారిత మోడళ్ల అభివృద్ధికి అవసరమైన కంప్యూటింగ్ రిసోర్సెస్​ను అందిస్తుంది.

సమర్థవంతంగా పౌరసేవలు 

ఏఐలాంటి ఎమర్జింగ్​ టెక్నాలజీస్ సాయంతో పౌర సేవలను మరింత సమర్థవంతంగా ప్రజల ముంగిటకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.  ఆ దిశగా అడుగులు వేసేందుకు అవసరమైన ఏఐ పరిష్కార మోడళ్లను రూపొందించేందుకు టీజీడెక్స్ దిక్సూచిగా మారుతుంది.  ఉదాహరణకు  ఏ రూట్ లో... ఏ సమయంలో...  ప్రయాణికుల నుంచి ఎంత డిమాండ్​ ఉందో తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రయాణీకులకు బస్సులను అందుబాటులో ఉంచాలని టీజీఎస్ ఆర్టీసీ భావించింది.  అప్పుడు ఈ టీజీడెక్స్ అందుకు అవసరమైన డేటాను ఏఐ ద్వారా విశ్లేషించి అందిస్తుంది.

సమాచార లభ్యత 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. అయితే... వాటికెలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలనే తదితర అంశాలపై చాలామందికి సందేహాలుంటాయి. ఒకే దగ్గర మనకు కావాల్సిన అధీకృత సమాచారం దొరకదు.  ఇలాంటి తరుణంలో టీజీడెక్స్ మార్గనిర్దేశం చేస్తుంది.సాంకేతిక సమగ్రత - సాంకేతికత సమానత్వానికి, సమ్మిళిత్వానికి టీజీడెక్స్ దోహదపడుతుంది. ఏఐ పరిష్కార మోడళ్లు దివ్యాంగులు, వృద్ధులు వంటి బలహీన వర్గాలకు మేలు చేస్తాయి. 

‘విద్య’లో విప్లవాత్మకం 

‘డ్రా- అండ్- లెర్న్’ వంటి ఏఐ ఆధారిత విద్యా సాధనాలు,  తెలుగు, ఇంగ్లిష్‌‌‌‌, ఇతర భాషల్లో పిల్లలు కొత్త పదజాలాన్ని బొమ్మలు గీస్తూ నేర్చుకోవడానికి సహాయపడతాయి. ఇలాంటివాటి తయారీకి అవసరమైన డేటాను టీజీడెక్స్ అందిస్తుంది.  కొత్త ఆవిష్కరణల వైపు అడుగులుపడతాయి. ఒకేతాటిపైకి అందరూ ఒంటరిగా మనం అంతగా సాధించలేం.  అదే సమష్టిగా  కృషిచేస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. టీజీడెక్స్ స్టార్టప్​లు,  పరిశోధనలు,  ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. సమాజంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపేలా వారిని ఒకేతాటిపైకి తీసుకొచ్చి ప్రోత్సహిస్తుంది.

2027 నాటికి కోటి మందికి..

తెలంగాణను ‘గ్లోబల్ కేపిటల్ ఆఫ్ ఏఐ’ గా తీర్చి దిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలో  మంత్రి శ్రీధర్ బాబు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు. ఆ దిశగా వేసిన అడుగే ‘టీజీడెక్స్’. ప్రస్తుతం టీజీడెక్స్ లో సుమారు 21 రంగాలకు సంబంధించిన 500కు పైగా కేటగిరీలకుపైగా డేటా బ్యాంక్ సిద్ధంగా ఉంది.  360 ఏఐ మోడళ్లు, 10 యూజ్ కేసెస్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.  అయిదేళ్లలో డేటా బ్యాంక్ ను 2వేల కేటగిరీలకు చేర్చేందుకు ప్రభుత్వం  ప్రణాళికలు రూపొందించింది. 

2027 నాటికి టీజీడెక్స్ మార్గదర్శనంలో ఆవిష్కృతమయ్యే  శక్తిమంతమైన ఏఐ మోడళ్లు కోటిమందికి పైగా తెలంగాణ పౌరులకు మెరుగైన పౌర సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  ‘టీజీడెక్స్ కేవలం ఒక సాంకేతిక ప్రాజెక్ట్ కాదు.  ఇది ఒక సుసంపన్నమైన, సమ్మిళిత భవిష్యత్తు వైపు వడివడిగా అడుగులు వేస్తున్న తెలంగాణ పురోగతికి చిహ్నం’.  ఈ  చొరవ  దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక ప్రేరణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- పి.భానుచందర్ రెడ్డి,   ఐటీ, పరిశ్రమల శాఖ ,మంత్రి పీఆర్వో-