
సంక్రాంతి వస్తోందంటే టాలీవుడ్‌లో సినిమాల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి సీజన్‌లో రావడానికే ఫిక్సవుతాయి. వచ్చే సంక్రాంతి స్లాట్స్ కూడా ఎప్పుడో బుక్కయ్యాయి. రాధేశ్యామ్, భీమ్లానాయక్, సర్కారువారి పాట, ఎఫ్3 లాంటి టాప్ స్టార్ల చిత్రాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. కానీ ఎప్పుడైతే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారో.. అప్పుడే సీన్ రివర్స్ అయ్యింది. అప్పటికే కర్చీఫులు వేసుకున్న సినిమాలన్నీ తమ విడుదల తేదీలు మార్చుకోవడం మొదలుపెట్టాయి. ‘సర్కారువారి పాట’ ఏప్రిల్ 1కి వెళ్లిపోయింది. ‘ఎఫ్3’ ఫిబ్రవరి 25కు ఫిక్సయ్యింది. ఒకేసారి పెద్ద సినిమాలన్నీ వస్తే థియేటర్ల సమస్య వచ్చి బిజినెస్ సరిగ్గా జరగదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లానాయక్’ కూడా వాయిదా పడుతుందనే వార్తలు వినిపిస్తూ ఉండటంతో టీమ్ రియాక్టయ్యింది. భీమ్లానాయక్ సంక్రాంతి బరిలోనే ఉంటాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేయడం ఖాయమని కన్‌ఫర్మ్ చేశారు. పవన్, రానా కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ డైలాగ్స్, స్ర్కీన్‌ప్లే రాస్తున్నారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్. రావు రమేష్, మురళీశర్మ, సముద్రఖని, రఘుబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.