
- తమకు నోటీసులు ఇవ్వకుండానే సభ్యత్వాలు రద్దు చేశారంటున్న పాత పాలకవర్గం
- బ్యాంకుకు ఎన్నికలు జరగక 8 ఏళ్లు
- నామినేటెడ్ కమిటీలతోనే కాలయాపన
- రేటింగ్ తగ్గిస్తున్న ఆర్బీఐ.. మసకబారుతున్న బ్యాంకు ప్రతిష్ట
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో రెండు గ్రూపుల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. నిరుడు నామినేట్ అయిన అర్బన్ బ్యాంకు పీఐసీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి ఆధ్వర్యంలో తాజాగా జరిగిన సర్వసభ్య సమావేశంలో మాజీ చైర్మన్ కర్రా రాజశేఖర్ సహా 15 మంది డైరెక్టర్ల సభ్యత్వాలు రద్దు చేయడం సంచలనం సృష్టించింది. ఎనిమిదేళ్ల కాలంలో ఎప్పుడు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించినా.. కోరం లేకుండానే జరగడం, ఆ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడం వివాదాస్పదంగా మారింది.
మరోవైపు కోర్టు కేసులు, రాజకీయ నాయకుల జోక్యంతో 8 ఏళ్లుగా అర్బన్ బ్యాంకుకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో నామినేటెడ్ కమిటీలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాలకవర్గం లేనందున రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అర్బన్ బ్యాంకుకు రేటింగ్ తగ్గిస్తూ పోవడం, బ్యాంకు లోన్ల మంజూరులో అవకతవకలు చర్చనీయాంశంగా మారడంతో బ్యాంకు ప్రతిష్ట మసకబారుతోంది. సహకార బ్యాంకులో అవకతవకలు జరిగితే విచారణ జరిపి, చక్కదిద్దాల్సిన కోఆపరేటివ్ శాఖ ఆఫీసర్లు చోద్యం
చూస్తున్నారు.
మాజీ చైర్మన్, 15 మంది డైరెక్టర్ల సభ్యత్వం రద్దుపై రచ్చ
2007 నుంచి 2017 వరకు రెండు దఫాలుగా చైర్మన్‌గా పని చేసిన కర్రా రాజశేఖర్ తోపాటు, పాలకవర్గ సభ్యులుగా ఉన్న ఎండీ షమియోద్దీన్, లక్ష్మణ రాజు, వరాల జ్యోతి, దేశ వేదాద్రి, అనరాసు కుమార్, కే రవి, సరిల్ల ప్రసాద్, వజీర్ అహ్మద్, తాటికొండ భాస్కర్, బాశెట్టి కిషన్, బొమ్మరాతి సాయికృష్ణ, దునిగంటి సంపత్, తాడ వీరారెడ్డి, ముద్దసాని క్రాంతికి అర్బన్ బ్యాంకు సభ్యత్వాన్ని శాశ్వతంగా తొలగిస్తూ ఈ నెల 3న జరిగిన సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
హైకోర్టు తీర్పును అనుసరించి కరీంనగర్ అర్బన్ బ్యాంకులో 2007 నుంచి 2017 వరకు బ్యాంకులో జరిగిన అక్రమాలకు బాధ్యులుగా చేస్తూ వారి సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు బ్యాంకు చైర్మన్ విలాస్ రెడ్డి వెల్లడించారు. కాగా పదేళ్లలో జరిగిన లావాదేవీలపై ఎలాంటి విచారణ జరపకుండా, తమకు నోటీసులు ఇవ్వకుండానే సభ్యత్వం రద్దు చేశారని, అసలు కోరం లేకుండా కేవలం 200 మందితో సమావేశం నిర్వహించడం ఎలా చెల్లుబాటు అవుతుందని మాజీ చైర్మన్ కర్రా రాజశేఖర్ వాదన. గతంలో బ్యాంకు ఎన్నికల్లో చైర్మన్‌గా ఓడిపోయిన విలాస్ రెడ్డి.. భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో తనకు అడ్డు లేకుండా చేసేందుకు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
8 ఏళ్లుగా ఎన్నికల్లేవ్
కరీంనగర్ అర్బన్ బ్యాంకు పాలకవర్గ ఎన్నికలు జరగక 8 ఏళ్లు అవుతోంది. 2017 ఏప్రిల్14న బ్యాంకు పాలకవర్గ పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు సహకార శాఖ ఆఫీసర్లు అప్పట్లో బ్యాంకు ఓటర్ల జాబితా ప్రదర్శించారు. ఆ జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది.
ఆ తర్వాత పర్సన్ ఇన్‌చార్జి కమిటీతోనే బ్యాంకు కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఈ నామినేటెడ్ పదవీ కాలం 2022 ఏప్రిల్14న ముగిసింది. ఆ తర్వాత రెండేళ్లు అర్బన్ బ్యాంకుకు పాలకవర్గం, పర్సన్ ఇన్‌చార్జి కమిటీ లేదు. ఈ క్రమంలోనే జనవరిలో పర్సన్ ఇన్‌చార్జి కమిటీ చైర్మన్‌గా గడ్డం విలాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించగా.. బాధ్యతలు స్వీకరించారు.
ఓటర్ల జాబితాపై గందరగోళం..
1980లో ఏర్పాటైన కరీంనగర్ అర్బన్ బ్యాంకు కార్పొరేట్‌బ్యాంకులకు దీటుగా పురోగతి సాధించింది. కరీంనగర్ లో మెయిన్ ఆఫీసు, జగిత్యాల, గంగాధర ఎక్స్ రోడ్డు మధురానగర్ బ్రాంచీలు ఉన్నాయి. బ్యాంకు ప్రారంభమయ్యాక 25 ఏళ్లలో 2007 వరకు రూ.24 కోట్ల డిపాజిట్లు ఉండగా.. 2007 నుంచి 2017 వరకు అప్పటి పాలకవర్గం రూ.60 కోట్ల మేర డిపాజిట్లు సేకరించింది.
ఎనిమిదేళ్లలో రూ.8 కోట్ల మేర డిపాజిట్లు వచ్చాయి. ఇళ్లు, బంగారం తాకట్టు పెట్టుకొని స్వల్పకాలిక రుణాల మంజూరుతోపాటు డిపాజిట్లు కూడా పెంచుకోవడంతో బ్యాంకు లాభాలు ఆర్జిస్తోంది. బ్యాంకులో ఒకప్పుడు 19,285 మంది సభ్యత్వాలు ఉండగా.. 2017లో కోర్టు ఆదేశాలతో సహకారశాఖ డోర్ టు డోర్ సర్వే నిర్వహించి అడ్రసుల్లో ఉన్న ఓటర్లు 9 వేల మందిగా తేల్చింది.