విద్యుత్‌‌ ఆర్టిజన్‌‌ల సమ్మె..కఠిన చర్యలకు రెడీ అవుతున్న ఆఫీసర్లు

విద్యుత్‌‌ ఆర్టిజన్‌‌ల సమ్మె..కఠిన చర్యలకు రెడీ అవుతున్న ఆఫీసర్లు

 

హైదరాబాద్‌‌, వెలుగు :  రాష్ట్రంలోని విద్యుత్‌‌ సంస్థల్లో పనిచేస్తున్న 23వేల మంది ఆర్టిజన్‌‌లు పీఆర్‌‌సీ 51శాతం అమలు చేయాలని డిమాండ్‌‌ చేస్తూ మంగళవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సమ్మెపై నిషేధం అమలులో ఉందని కాదని సమ్మెకు దిగితే కఠిన చర్యలు తప్పవని విద్యుత్‌‌ సంస్థల సీఎండీలు హెచ్చరిస్తున్నారు. తమపై ఎస్మా ప్రయోగించినా సమ్మె నుంచి వెనక్కు తగ్గేదిలేదని ఆర్టిజన్‌‌ సంఘాలు అంటున్నాయి.  దీంతో విద్యుత్‌‌ సంస్థల్లో ఉత్కంఠ నెలకొంది. విద్యుత్‌‌ సరఫరా అంతరాయాలను సమీక్షించే  ఫీల్డ్‌‌ స్థాయి సిబ్బంది సమ్మెకు దిగితే ఇబ్బందులు తలెత్తే చాన్స్  ఉంటుందని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెబుతున్నారు. ఆర్టిజన్‌‌లతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నరు. విద్యుత్‌‌ సమ్మెను అడ్డుకునేందుకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలువురు  ఆర్టిజన్‌‌ సంఘాల నేతలను  పోలీసులు అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. 

ఎస్మా అమలు చేస్తం : సీఎండీలు ప్రభాకర్‌‌రావు, రఘుమారెడ్డి 

అత్యవసర సర్వీసుల చట్టం ఎస్మా అమలులో ఉన్నందున కొందరు ఆర్టిజన్లు ఇచ్చిన సమ్మె పిలుపు పూర్తిగా చట్ట విరుద్ధమని విద్యుత్‌‌ సంస్థల సీఎండీలు  ప్రభాకర్‌‌రావు, రఘుమారెడ్డి తెలిపారు.  ఆర్టిజన్ల సర్వీసు నిబంధన ప్రకారం.. సమ్మె దుష్ప్రవర్తన కింద పరిగణిస్తామని హెచ్చరించారు. సమ్మెలో ఎవ్వరూ పాల్గొనవద్దని, ఒకవేళ పాల్గొంటే..చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగ సంఘాలతో పీఆర్‌‌సీపై ఒప్పందం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అయినప్పటికీ కొందరు వివిధ సాకులతో సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు మేనేజ్ మెంట్ దృష్టికి వచ్చిందని వివరించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు బాధ్యులైన వాళ్ళను ఉపేక్షించబోమని సీఎండీలు హెచ్చరించారు. హెల్త్ ఇష్యూస్ మినహాయించి ఇతర కారణాలతో డ్యూటీకి రాని ఆర్టిజన్‌‌లను ఉద్యోగాల నుంచి టెర్మినట్ చేయాలని అధికారులకు సదరన్‌‌ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.  డ్యూటీకి రాకుండా అక్రమంగా సమ్మేలో పాల్గొనే ఆర్టిజన్‌‌లను 2019 ఆర్టిజన్‌‌ రెగ్యూలేషన్‌‌ యాక్ట్ ప్రకారం.. జాబ్  నుంచి టెర్మినేట్‌‌ చేయాలని సూపరింటెండెంట్‌‌ ఇంజినీర్‌‌లకు తెలిపారు.