పీపీఎఫ్‌: ఇతర స్కీములతో పోలిస్తే వడ్డీ ఎక్కువ

పీపీఎఫ్‌: ఇతర స్కీములతో పోలిస్తే వడ్డీ ఎక్కువ
  • పన్నులాభాలూ ఉంటాయి
  • పార్షియల్‌‌ విత్‌‌డ్రాయల్ సదుపాయం

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: ఎంప్లాయిస్ సహా సాధారణ జనానికి కూడా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) చాలా ముఖ్యమైన ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ స్కీమ్‌‌.  భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన, దీర్ఘకాలిక పెట్టుబడిగా దీనికి పేరుంది. పదిహేను ఏళ్ల తర్వాత పెట్టుబడిదారులకు భారీ మొత్తాన్ని వచ్చేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన  స్కీమ్‌‌ ఇది. మెచ్యూరిటీ సమయంలో భారీగా డబ్బు చేతికి వస్తుంది కాబట్టి చాలా మందికి ఇది ఫేవరెట్‌‌ స్కీము అని చెప్పొచ్చు. ఆర్థిక మంత్రిత్వ శాఖ  నేషనల్ సేవింగ్స్ ఇన్‌‌స్టిట్యూట్ ద్వారా 1968 లో పీపీఎఫ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  బిజినెస్‌‌ చేసేవాళ్లు, నిరుద్యోగులు, ఉద్యోగులు సహా పదవీ విరమణ చేసిన వారు కూడా పీఎఫ్‌‌ ఖాతా తెరిచి ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం. 

  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌‌లో ఎంత పెట్టాలనేది మన ఇష్టం.   రిస్ట్రిక్షన్లు ఏవీ ఉండవు. కనీసం రూ.500 నుంచి రూ.1.50 లక్షల మధ్య.. ఎంతైనా ఇన్వెస్ట్‌‌ చేయవచ్చు. 
  • పీపీఎఫ్‌‌ 100 శాతం రిస్క్ లేని పెట్టుబడి. ఈ ఫండ్‌‌కు కేంద్ర ప్రభుత్వ రక్షణ ఉంటుంది.  స్టాక్స్‌‌ రేట్ల మాదిరిగా భారీ ఒడుదుడుకులు ఉండవు. వడ్డీరేటు ఏడు/ఎనిమిది శాతానికిపైగా ఉంటుంది.  ఇది లాంగ్‌‌టర్మ్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ కాబట్టి పీఎఫ్ పెట్టుబడి మీద వడ్డీపై వడ్డీ వస్తుంది. ఫలితంగా భారీ రాబడిని ఇస్తుంది. ప్రస్తుత వడ్డీరేటు 7.1 శాతం.
  • ఖాతాదారుడు అత్యవసర పరిస్థితుల్లో సంవత్సరానికి కేవలం ఒకశాతం వడ్డీ రేటుతో లోన్‌‌ తీసుకోచ్చు. పీపీఎఫ్  అకౌంట్‌‌ తెరిచిన మూడవ సంవత్సరం నుండి ఆరవ సంవత్సరం వరకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఆరు సంవత్సరాల తరువాత, అకౌంట్‌‌దారుడు పీపీఎఫ్ నుండి కొంత డబ్బును అడ్వాన్సుగా తీసుకోవచ్చు.
  • పీపీఎఫ్‌‌లో కనీసం 15 సంవత్సరాలు పొదుపు చేయాలి. అయితే తదనంతరం కూడా  పీపీఎఫ్ అకౌంట్‌‌ ను అవసరమైనన్ని సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. ఇందుకోసం బ్యాంకుల్లో లేదా పోస్టాఫీసుల్లో పీపీఎఫ్ అకౌంట్‌‌ పొడిగింపు ఫారమ్‌‌ను అందజేయాలి.
  • పీపీఎఫ్ అకౌంట్ హోల్డర్ మూడు సార్లు పన్ను మినహాయింపులను పొందవచ్చు.   డబ్బును తీసుకునేటప్పుడు, ఇన్వెస్ట్‌‌ చేసేటప్పుడు, జమయ్యే వడ్డీకి పన్ను ఉండదు. సెక్షన్​ 80సిసి ప్రకారం సంవత్సరానికి రూ .1.5 లక్షల విలువైన ట్యాక్స్‌‌ డిడక్షన్‌‌ను అందిస్తుంది.

ఆన్‌‌లైన్‌‌లో పీపీఎఫ్ అకౌంట్‌‌ను ఎలా తెరవాలి?

పీపీఎఫ్ అకౌంట్‌‌లను ఆన్‌‌లైన్‌‌లో తెరవవచ్చు లేదా అకౌంట్‌‌ తీసుకోవడానికి దగ్గర్లోని బ్యాంకులకు కూడా వెళ్లవచ్చు. ఆన్‌‌లైన్‌‌లో పీపీఎఫ్ అకౌంట్‌‌ తెరవాలంటే .. కస్టమర్లు తమ బ్యాంకుల నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌‌లోకి లాగిన్ అవ్వాలి. అందులో ‘ఓపెన్‌‌ పీపీఎఫ్ అకౌంట్‌‌’ ఆప్షన్‌‌పై క్లిక్‌‌ చేయాలి.   బ్యాంకు ఖాతా,  నామినీ పేర్ల వంటి వివరాలతో సహా అన్ని ఖాళీలను నింపాలి. ఈ భాగం పూర్తయిన తర్వాత ఏటా పెట్టే ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ మొత్తం వివరాలను తెలియజేయాలి. ఈ వివరాల వెరిఫేషన్‌‌ కోసం మన మొబైల్‌‌ నంబరుకు ఓటీపీ వస్తుంది. ట్రాన్సాక్షన్‌‌ పాస్‌‌వర్డ్ టైప్‌‌ చేసినా పని పూర్తవుతుంది.