
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూవీ ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు నిర్మించిన ఈ మూవీ జనవరి 14న ఐదు ఇండియన్ లాంగ్వేజెస్‌తో పాటు చైనీస్, జపనీస్ భాషల్లోనూ విడుదల కాబోతోంది. ఈ క్రమంలో నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముందుగా అన్ని భాషల ట్రైలర్లనూ ఫ్యాన్స్‌తో విడుదల చేయించారు. ఆ తర్వాత కృష్ణంరాజు మాట్లాడుతూ ‘రెబల్ స్టార్ యాభై ఐదేళ్ల పాటు అభిమానుల్ని అలరిస్తే..ఈ రెబల్ (ప్రభాస్) మరో యాభయ్యేళ్లు ఆనందింపజేస్తాడు’ అన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ ‘ట్రైలర్ లాంచ్ చేసిన ఫ్యాన్స్‌కి థాంక్యూ. ఇది లవ్‌స్టోరీయే కానీ అంతకుమించి ఉంటుంది. కోవిడ్ టైమ్‌లో కూడా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ అంతా చాలా కష్టపడి పని చేశారు. జార్జియా, ఇటలీ, హైదరాబాద్‌లలో షూట్ చేశాం. పెదనాన్నతో పాటు ఈ సినిమాలో నటించిన సత్యరాజ్, సచిన్, జయరామ్, భాగ్యశ్రీ గార్లకు కూడా థ్యాంక్స్. జగపతిబాబు అతిథి పాత్ర చేశారు. జస్టిన్ మ్యూజిక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. పూజాహెగ్డే ఈ సినిమాలో మరింత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. రాధాకృష్ణ ఐదేళ్లు ఈ సినిమాపై పని చేయడం చిన్న విషయం కాదు. మూవీలో చాలా మలుపులున్నాయి. క్లైమాక్స్ హైలైట్. అందరూ ఎంజాయ్ చేస్తారు’ అన్నాడు.
‘ఈ సినిమా విషయంలో చాలా ఎక్సయిటెడ్‌గా ఉన్నాను. బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ, రియల్ ఎమోషన్స్ ఉంటాయి. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ ఫిల్మ్‌లో కొత్త ప్రభాస్‌ను, కొత్త పూజను చూస్తారు’ అని చెప్పింది పూజా హెగ్డే. రాధాకృష్ణ కుమార్ మాట్లాడుతూ ‘సినిమా తీయడానికి నాలుగేళ్లు పట్టింది. కానీ రాయడానికి మాత్రం పద్దెనిమిదేళ్లు పట్టింది. ఫిలాసఫీకి లవ్‌ని యాడ్ చేసి ప్రభాస్‌కి చెప్పాను. తనకి చాలా నచ్చింది. ఈ సినిమాలో ఫైట్స్ ఉండవు కానీ అమ్మాయికి, అబ్బాయికి మధ్య జరిగే యుద్ధాలుంటాయి. చేజ్‌లుండవు కానీ ఒకమ్మాయి కోసం సప్త సముద్రాలూ ఈదే అబ్బాయి జర్నీ ఉంటుంది. ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఏ మాత్రం తగ్గదు. ప్రభాస్ లాంటి ఫ్రెండ్, గురువు అందరికీ ఉండాలి’ అని చెప్పాడు. నెక్స్ట్ ప్రభాస్‌తో సినిమాలు తీస్తున్న దర్శకులు నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, ఓం రౌత్ కూడా హాజరై టీమ్‌కి ఆల్ ద బెస్ట్ చెప్పారు. సచిన్ ఖేడ్కర్, జయరామ్, లిరిసిస్ట్ కృష్ణకాంత్, మ్యూజిక్ డైరెక్టర్స్ జస్టిన్ ప్రభాకరన్, యువన్ శంకర్ రాజా, నిర్మాతలు వంశీ, ప్రమోద్, దిల్ రాజు కూడా పాల్గొన్నారు. నవీన్ పొలిశెట్టి ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించాడు.