ప్రైవేట్ జాబ్లో చేరిన యువతకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్.. 15 వేలు ఇస్తారంట..!

ప్రైవేట్ జాబ్లో చేరిన యువతకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్.. 15 వేలు ఇస్తారంట..!

న్యూఢిల్లీ: 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. దేశ యువత కోసం లక్ష కోట్ల రూపాయలతో కొత్త పథకం ప్రకటించారు. ‘పీఎం వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన’ పేరుతో పథకం తీసుకొచ్చినట్లు చెప్పారు. పంద్రాగస్టు సందర్భంగా నేటి నుంచే పథకం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

కొత్తగా ప్రైవేట్ ఉద్యోగంలో చేరిన యువతకు 15 వేల రూపాయలు లబ్ధి చేకూరేలా ఈ పథకం ద్వారా ప్రోత్సాహక సాయం అందిస్తామని ప్రకటించారు. ఈ పథకం ద్వారా దేశంలోని మూడున్నర కోట్ల మందికి పైగా యువతకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.

ఈ పథకం కింద EPFOలో మొదటిసారి నమోదు చేసుకున్న ఉద్యోగులు ఒక నెల EPF వేతనం 15 వేల రూపాయల వరకు - రెండు వాయిదాలలో పొందుతారు. లక్ష రూపాయల వరకు జీతాలు ఉన్న ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు. మొదటి విడతలో ఆరు నెలలు ఉద్యోగం చేశాక సగం డబ్బు సదరు ఉద్యోగికి అందుతుంది. 

రెండవ విడత డబ్బును 12 నెలల సర్వీస్ తర్వాత చెల్లిస్తారు. పొదుపును అలవాటుగా మార్చి ఉద్యోగిని ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి అన్ని చెల్లింపులు ఆధార్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టమ్ (ABPS) ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) మోడ్లో పేమెంట్ చేస్తారు.