
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై ప్రగతి మీటింగ్‌లో చర్చించనున్నారు. ఈ నెల 29న ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. మన రాష్ట్రం నుంచి దేవాదులతో పాటు ఇందిరమ్మ ఫ్లడ్‌ఫ్లో కెనాల్, ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపైనా మీటింగ్‌లో చర్చించనున్నారు. ఆయా ప్రాజెక్టుల పనుల పురోగతితో పాటు పనులకు ఉన్న అడ్డంకులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.
దేవాదుల ప్రాజెక్టును రూ.13,445 కోట్లతో చేపడుతుండగా, ఇప్పటిదాకా 87 శాతం పనులు పూర్తయ్యాయి. నిధులు కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు చేశారు. 2027 డిసెంబర్‌నాటికి పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్టుకు 9 జిల్లాల్లోని 2 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అంతేగాకుండా చిత్తకోడూరు రైట్‌మెయిన్ కెనాల్కింద 9 వేల ఎకరాల భూములపై రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇటు శ్రీరాంసాగర్ప్రాజెక్ట్ఆధారంగా చేపట్టిన ఇందిరమ్మ ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌ను రూ.5,940 కోట్లతో చేపట్టగా.. ఇప్పటిదాకా 92 శాతం పనులు పూర్తయ్యాయి. 2026 డిసెంబర్‌నాటికి పూర్తి చేసేందుకు టార్గెట్‌గా పెట్టుకున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులవుతున్న 291 కుటుంబాలకు సెటిల్మెంట్, 247 ఎకరాల భూసేకరణ వంటి సమస్యలున్నాయి. దాంతో పాటు అసలు ప్రాజెక్టుకు అంత ఎక్కువ ఖర్చు ఎందుకు అయిందో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని కేంద్రం అడుగుతున్నది. ఈ రెండు ప్రాజెక్టులకు ఉన్న ఈ సమస్యలపై ప్రగతి మీటింగ్‌లో చర్చించనున్నారు.
పోలవరం చర్చకొస్తదా..?
ఈ మీటింగ్‌లో పోలవరం ప్రాజెక్టు పురోగతిపైనా చర్చించనున్నారు. ఈ సందర్భంగా పోలవరం ముంపు ముప్పుపై తెలంగాణ లేవనెత్తనుంది. ఈ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో వేలాది ఎకరాలు మునగడంతో పాటు భద్రాచలం టౌన్, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్లకూ ముంపు ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలోనే ముంపునకు సంబంధించి కచ్చితంగా సర్వే చేయించి డీమార్కేషన్ చేయించాలని మన రాష్ట్రం పట్టుబడుతున్నది.
కానీ, ఏపీ మాత్రం జాయింట్ సర్వేకు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఈ అంశాలను ప్రగతి మీటింగ్‌లో తెలంగాణ లేవనెత్తే అవకాశాలు ఉన్నాయి. అలాగే బనకచర్ల ప్రాజెక్టుపైనా అభ్యంతరాలు తెలిపే అవకాశాశం ఉంది. వాస్తవానికి గతంలో మే 24న మీటింగ్ నిర్వహించాల్సి ఉన్నా.. రెండు రోజుల ముందు పోలవరం అంశాన్ని ఎజెండా నుంచి ఎత్తేశారు. ఆ తర్వాత జూన్ 25న మీటింగ్ పెట్టినా.. మీటింగ్‌కు రెండు గంటల ముందు ఆ అంశాన్ని తొలగించారు.
జులై 30న కూడా సమావేశాన్ని నిర్వహించినా చర్చించలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు జరిగే మీటింగ్‌లోనైనా ఈ అంశాన్ని చర్చిస్తారా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బనకచర్లపైనా అభ్యంతరాలు తెలిపేందుకు గత మీటింగ్‌లోనే అధికారులు నోట్స్ప్రిపేర్చేసుకున్నా ఆ అంశాన్ని చర్చించలేదు. తాజాగా జరిగే మీటింగ్‌లో బనకచర్ల అంశాన్నీ చర్చించే అవకాశాలు లేకపోలేదు.