చెన్నై: ఇండియా గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద వచ్చే ఏడాది జరిగే ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు క్వాలిఫై అయ్యాడు. 2025 సీజన్ ఫిడే సర్క్యూట్‌లో విజేతగా నిలవడం ద్వారా అతను ఈ మెగా టోర్నీ బెర్తు దక్కించుకున్నాడు. ఈ సర్క్యూట్ ఏడాది పొడవునా జరిగిన మెయిన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లలో ప్లేయర్ల పెర్ఫామెన్స్ ఆధారంగా పాయింట్లను లెక్కించి, విజేతకు క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో నేరుగా ప్రవేశం కల్పిస్తారు. ఇండియా నుంచి ఏకైక బెర్తు సొంతం చేసుకున్న 20 ఏండ్ల ప్రజ్ఞా ఈ ఏడాది అత్యంత నిలకడగా రాణించాడు. విక్ ఆన్ జీ మాస్టర్స్, సూపర్‌బెట్ చెస్ క్లాసిక్ రొమేనియా, ఉజ్చెస్ కప్ మాస్టర్స్, లండన్ చెస్ క్లాసిక్ ఓపెన్ తదితర టోర్నీల్లో టైటిల్ నెగ్గాడు.
స్టెపాన్ అవాగ్యాన్ మెమోరియల్, సింక్ ఫీల్డ్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచాడు. కాగా, రాబోయే వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంప్ (డి. గుకేశ్)కు ప్రత్యర్థిని క్యాండిడేట్స్ టోర్నీ నిర్ణయిస్తుంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 16 వరకు సైప్రస్‌లోని పేజియాలో జరిగే క్యాండిడేట్స్ టోర్నీలో పోటీకి ఎనిమిది మందికి అవకాశం ఉండగా.. ఇప్పటికే ఏడు స్థానాలు ఖరారయ్యాయి. మిగిలిన బెర్త్ ఫిడే రేటింగ్ ఆధారంగా ఖరారు కానుంది. కాగా, విమెన్స్ క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు ఇండియా నుంచి ఇప్పటికే కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్,ఆర్. వైశాలి అర్హత సాధించారు.

