ప్రాగ్: ఇండియా గ్రాండ్ మాస్టర్, వరల్డ్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ ప్రాగ్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ టోర్నమెంట్‌ను డ్రాతో ఆరంభించాడు. మాస్టర్స్ విభాగంలో భాగంగా బుధవారం రాత్రి జరిగిన తొలి రౌండ్‌లో గుకేశ్, అమెరికా ప్లేయర్ హాన్స్ మోక్ నీమన్ మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగి చివరకు డ్రాగా ముగిసింది. నల్ల పావులతో ఆడిన నీమన్ ఆట ప్రారంభంలోనే 13వ ఎత్తు వద్ద తన గుర్రంను త్యాగం చేసి గుకేశ్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు.
ఒక దశలో గుకేశ్ ఓటమి దిశగా వెళ్తున్నట్లు కనిపించినా, తన అద్భుతమైన డిఫెన్స్ వ్యూహంతో పుంజుకుని 62 ఎత్తుల్లో ఆటను డ్రా చేయగలిగాడు. ఇతర ఇండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ అరవింద్ చిదంబరం.. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన నోదిర్‌బెక్ అబ్దుసట్టోరోవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. చాలెంజర్స్ విభాగంలో ఆడుతున్న సీనియర్ ప్లేయర్ సూర్యశేఖర్ గంగూలీ కూడా నెదర్లాండ్స్ ప్లేయర్ థామస్ బీర్డ్సెన్ చేతిలో ఓడిపోయాడు. వరల్డ్ కప్ విన్నర్ దివ్య దేశ్‌ముఖ్ చాలెంజర్స్ విభాగంలో బెంజమిన్ గ్లెడురాతో జరిగిన గేమ్‌లో గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ చివరకు డ్రా చేసుకుంది.
