6 నియోజకవర్గాల్లో ‘‘ప్రజా గోస.. బీజేపీ భరోసా’’ కార్యక్రమం

6 నియోజకవర్గాల్లో ‘‘ప్రజా గోస.. బీజేపీ భరోసా’’ కార్యక్రమం
  • సిద్దిపేట, వేములవాడలో ప్రారంభించనున్న సంజయ్  
  • 23 నుంచి రెండో విడత మొదలు 

హైదరాబాద్, వెలుగు : ‘‘ప్రజా గోస.. బీజేపీ భరోసా’’ కార్యక్రమం గురువారం నుంచి మొదలు కానుంది. బూత్ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయడం, కేంద్ర పథకాలపై, కేసీఆర్ నెరవేర్చని హామీలపై ప్రజలకు వివరించడమే లక్ష్యంగా పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది. పల్లెల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రచారం చేయనుంది. మొదటి విడతలో గురువారం నుంచి 6 నియోజకవర్గాల్లో, ఈ నెల 23 నుంచి ఆగస్టు 1 దాకా రెండో విడతలో మరో 7 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం సిద్దిపేటలో, మధ్యాహ్నం వేములవాడలో బీజేపీ స్టేట్ చీఫ్ ​సంజయ్ ప్రారంభిస్తారు. జుక్కల్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ప్రారంభిస్తారు. కార్యక్రమ వివరాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉంటామనే భరోసా ఇచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రజలు 63591 99199 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి బీజేపీకి మద్దతు తెలియజేయాలని కోరారు. 

రాష్ట్రపతి ఎన్నిక రిజల్ట్ రాగానే సంబురాలు.. 
రాష్ట్రపతి ఎన్నికలో ద్రౌపది ముర్మునే గెలుస్తుందని ధీమాతో ఉన్న బీజేపీ.. గురువారం ఫలితాలు ప్రకటించగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ తండాల్లో, గిరిజన గూడేల్లో విజయోత్సవ సంబురాలు నిర్వహించాలని క్యాడర్ కు పిలుపునిచ్చింది. ముర్ము ప్రమాణ స్వీకారం చేసే రోజు అన్ని పంచాయతీల్లో ర్యాలీలు తీయాలని రాష్ట్ర బీజేపీని హైకమాండ్ ఆదేశించింది. అన్ని పంచాయతీల్లో ఆమె ఫొటో పెట్టాలంది.

విమోచనం కాదు విముక్తి..  
ఈ ఏడాది సెప్టెంబర్ 17 నుంచి 2023 సెప్టెంబర్ 17 దాకా తెలంగాణ విముక్తి వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. ఇకపై విమోచనం బదులు విముక్తి  అనే పదం వాడాలని నిర్ణయించింది.