ప్రజాసమస్యల పరిష్కారమే ‘ప్రజాదర్బార్‌‌’ లక్ష్యం.. న్యాయబద్ధమైన సమస్యలను తప్పక పరిష్కరిస్తం

ప్రజాసమస్యల పరిష్కారమే ‘ప్రజాదర్బార్‌‌’ లక్ష్యం.. న్యాయబద్ధమైన సమస్యలను తప్పక పరిష్కరిస్తం
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి

ఖమ్మం రూరల్/కూసుమంచి, వెలుగు : ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటిని త్వరగా పరిష్కరించడమే ‘ప్రజాదర్బార్’ ప్రధాన ఉద్దేశం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి చెప్పారు. ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్‌‌తో కలిసి సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి మాట్లాడుతూ... పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో 14  క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్రజాదర్బార్‌‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏదులాపురం మున్సిపాలిటీ 15 డివిజన్లలో నిర్వహించిన ప్రజాదర్బార్‌‌లో 3,500కు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. చివరి దరఖాస్తు స్వీకరించే వరకు తాను స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. 

ప్రజాదర్బార్‌‌లో ఇప్పటి వరకు 21,536 దరఖాస్తులు అందాయని, అందులో అత్యధికంగా 9,731 దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్ల కోసమే వచ్చాయన్నారు. పెన్షన్ల కోసం సుమారు 4,700 దరఖాస్తులు, భూ సమస్యలకు 4 వేలు, గృహజ్యోతికి 900 అప్లికేషన్లు అందాయని పేర్కొన్నారు. కొన్ని రోజుల్లో ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. 

రాబోయే నెల రోజుల్లో పాలేరు నియోజకవర్గ పరిధిలో భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా... అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాన ప్రాధాన్యంతో అమలుచేస్తున్నామన్నారు. రెండో విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మరో 2 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 

మూడు, నాలుగో విడతల్లో కూడా ఇండ్ల మంజూరు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం రాజుపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. 

అలాగే కూసుమంచి మండల కేంద్రంలో నిర్మించిన విద్యుత్‌‌ రెవెన్యూ కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్‌‌ కలెక్టర్ పి. శ్రీనివాస్‌‌రెడ్డి, డీఎఫ్‌‌వో అనూజ్‌‌ అగర్వాల్‌‌, ఏదులాపురం మున్సిపల్‌‌ చైర్‌‌పర్సన్‌‌ అనిత, వైస్‌‌చైర్‌‌పర్సన్‌‌ నవీన్, మున్సిపల్‌‌ కమిషనర్‌‌ శ్రీనివాస్‌‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్‌‌ సైదులు పాల్గొన్నారు.