మొక్కుబడిగా సాగుతున్న ప్రజావాణి

మొక్కుబడిగా సాగుతున్న ప్రజావాణి

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: ప్రతి సోమవారం కలెక్టరేట్లలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాలు మొక్కుబడిగా మారుతున్నాయి. కింది స్థాయి ఉద్యోగులు పట్టించుకోకపోవడంతో తమ సమస్యలను కలెక్టర్‌‌కు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయన్న ఆశతో ఎంతో దూరం నుంచి వస్తున్న ప్రజలకు నిరాశే మిగులుతోంది. ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్న ఆఫీసర్లు పరిష్కరించేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఏళ్ల తరబడి కలెక్టరేట్‌‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 

ఎన్ని పరిష్కారం అయ్యాయో కూడా తెలియదట

కరోనా తర్వాత గ్రీవెన్స్‌‌ సెల్‌‌పై ఆఫీసర్లకు పట్టింపు లేకుండా పోయింది. ప్రజావాణికి జిల్లా స్థాయి ఆఫీసర్లు హాజరుకావాలని ఆదేశాలు ఉన్నా కొందరు పట్టించుకోవడం లేదు. గతంలో ఫిర్యాదుదారులు ఎవరు వచ్చినా వారి పేరు, వివరాలు, సమస్య నమోదు చేసి కంప్యూటర్‌‌ స్లిప్‌‌లు ఇచ్చేవారు. కొన్ని రోజుల తర్వాత ఆ స్లిప్‌‌ తీసుకొని వస్తే వారి సమస్య ఎక్కడ ఆగిపోయిందో చెప్పేవారు. కానీ కొన్ని నెలలుగా ఈ పద్ధతిని పాటించడం మానేశారు. ఫిర్యాదులు తీసుకున్న తర్వాత పేపర్‌‌పై పెన్నుతో రాసి పంపుతున్నారు. తర్వాత ఆ సమస్య పరిష్కారం అయ్యిందో లేదో చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. భూపాలపల్లిలో ప్రతీ వారం 40 నుంచి 60 ఫిర్యాదులు వస్తాయి. గడిచిన రెండు నెలల్లో సుమారు 300 వరకు అర్జీలు రాగా వాటిలో ఎన్ని పరిష్కారం అయ్యాయి ? ఇంకా ఎన్ని పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి ? అన్న వివరాలు కూడా సంబంధిత సిబ్బందికి తెలియకపోవడం గమనార్హం. అర్జీలను త్వరగా పరిష్కరించాలి 


వెంకటాపూర్ (ములుగు)/తొర్రూరు/వరంగల్‌‌సిటీ, వెలుగు : ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలని ములుగు కలెక్టర్‌‌ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. సోమవారం అడిషనల్‌‌ కలెక్టర్లు త్రిపాఠీ, వైవీ గణేశ్‌‌తో కలిసి ప్రజావాణికి హాజరై ఫిర్యాదులు తీసుకున్నారు. మొత్తం 30 ఫిర్యాదులు రాగా, ఇందులో 11 రెవెన్యూ శాఖకు సంబంధించినవి కాగా, మిగతా 19 ఇతర శాఖలకు చెందినవని చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల ప్రత్యేకాధికారులు ప్రతి మండల కేంద్రంలో ఒక రోజు రాత్రి బస చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. అలాగే తొర్రూరు ఆర్డీవో ఆఫీస్‌‌లో నిర్వహించిన ప్రజావాణికి మహబూబాబాద్‌‌ కలెక్టర్‌‌ శశాంక హాజరయ్యారు. మొత్తం 123 ఫిర్యాదులు రాగా ఇందులో భూ వివాదాలు, టెక్నికల్‌‌ సమస్యలు, పెన్షన్స్, డబల్‌‌ ఇండ్లపైనే అధిక ఫిర్యాదులు అందాయన్నారు. అనంతరం కలెక్టర్‌‌ మాట్లాడుతూ అన్ని శాఖల ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు. గ్రేటర్‌‌ వరంగల్‌‌ ప్రధాన కార్యక్రమంలో నిర్వహించిన ప్రజావాణికి 83 ఫిర్యాదులు అందగా ఇందులో సగానికి పైగా టౌన్‌‌ ప్లానింగ్‌‌కు సంబంధించినవే. 

రికార్డులను మార్చారని రైతు ధర్నా

మహబూబాబాద్‌‌ అర్బన్‌‌, వెలుగు: తన భూమిని అక్రమంగా ఇతరులకు పట్టా చేశారంటూ ఓ రైతు సోమవారం మహబూబాద్‌‌ కలెక్టరేట్‌‌ వద్ద నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... మహబూబాబాద్‌‌ జిల్లా మరిపెడ మండలం వీరారం శివారు జన్యాతండాకు చెందిన ధరావత్‌‌ రమేశ్‌‌కు చిన్నగూడూరు మండలం విస్సంపల్లి రెవెన్యూ పరిధిలో ఎకరం భూమి ఉంది. తనకు వారస్వతంగా వచ్చిన భూమిని 2018లో ధరావత్‌‌ హర్జా అనే వ్యక్తి పేరిట పట్టా చేసి పాస్‌‌ పుస్తకం ఇచ్చారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని ఐదేళ్లుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌‌ ముందు బైఠాయించిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్‌‌ ఇచ్చి పంపించారు. 


ఫొటోలో కనిపిస్తున్న మహిళ జనగాం గౌరేశ్వరి. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సెగ్గంపల్లి. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో భర్త వదిలేశాడు. దీంతో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారింటి వద్దే ఉంటోంది. ఈమెకు రేషన్‌‌‌‌ బియ్యం, ఆసరా ఫించన్‌‌ అందడం లేదు. దీంతో 2 నెలలుగా కలెక్టరేట్‌‌ చుట్టూ తిరుగుతోంది. 

వీళ్లంతా మల్హర్‌‌ మండలం ఎడ్లపల్లికి చెందిన గిరిజన రైతులు. 2019 ‒20లో గిరివికాసం కింద 9 చోట్ల బోర్లు వేసుకునేందుకు నిధులు మంజూరయ్యాయి. అప్పటి కలెక్టర్‌‌ నుంచి ఆర్డర్స్‌‌ కూడా పాసయ్యాయి. అయినా వీరు బోర్లు వేసుకోకుండా ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారు. సమస్యను పరిష్కరించాలని నాలుగేళ్లుగా కలెక్టరేట్‌‌ చుట్టూ తిరుగుతున్నారు.