కాళేశ్వరం కంటే పెద్ద స్కాం ధరణి:ప్రకాశ్ జవదేకర్

కాళేశ్వరం కంటే  పెద్ద స్కాం ధరణి:ప్రకాశ్ జవదేకర్

బీజేపీ అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం: ప్రకాశ్ జవదేకర్ 
ఇయ్యాల అమిత్ షా చేతుల మీదుగా మేనిఫెస్టో: కిషన్ రెడ్డి   
ధరణి బాధితులు కాల్ సెంటర్​కు ఫోన్ చేయండి: లక్ష్మణ్ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ధరణి పేరుతో భారీ భూకుంభకోణం జరిగిందని, ఇది కాళేశ్వరం కన్నా పెద్ద స్కామ్ అని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ధరణి కుంభకోణంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని ఆయన ప్రకటించారు. శుక్రవారం సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్ లో పార్టీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తో కలిసి జవదేకర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అతిపెద్ద మోసం ధరణి అని, ఈ పోర్టల్ వల్ల లక్షల మంది రైతులు తమ భూములను కోల్పోయారని ఫైర్ అయ్యారు. 

వాస్తవం ఇలా ఉంటే.. ప్రభుత్వం మాత్రం ధరణిని సర్వరోగ నివారిణిగా ప్రచారం చేసుకుంటోందన్నారు. కాళేశ్వరం, ధరణి రెండూ భారీ కుంభకోణాలని, తమ ప్రభుత్వం వస్తే బాధ్యులకు శిక్ష పడేలా చేసి, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ‘‘గ్రామాల్లో రెవెన్యూ రికార్డులను నిర్వహించాల్సిన వీఆర్వోల వ్యవస్థను లేకుండా చేశారు. ధరణిలో రెవెన్యూ రికార్డులను మార్చేసి.. పట్టాదార్, పొజిషన్(అనుభవదారు)ల స్థానంలో.. బినామీ, చొరబాటుదారు కాలమ్స్ చేర్చారు” అని ఆయన తెలిపారు.

ధరణి వల్ల వ్యవసాయ భూములు, ప్రైవేటు భూములు, ప్రభుత్వ భూములు, ఈడీ సీజ్ చేసిన భూములు, దేవాలయ భూములు, చెరువులు, కాందీశీకుల భూమి, పరిశ్రమల భూములు, భూదాన్ భూములు, ఎక్స్- సర్వీస్‌‌మెన్ భూములు, స్వాతంత్ర్య సమరయోధుల భూములు, బ్లూబుక్ ల్యాండ్స్ రికార్డుల్లో అవకతవకలు జరిగాయని జవదేకర్ ఆరోపించారు. గ్రామసభలు నిర్వహించకుండా భూరికార్డుల వ్యవస్థను తారుమారు చేయడంతో చాలా సర్వే నెంబర్లు మిస్ అయ్యాయన్నారు. లక్షల ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ కిందకు మారిందన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో సర్కారు ఫెయిల్ అయిందన్నారు.   

ఇయ్యాల బీజేపీ మేనిఫెస్టో విడుదల

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో శనివారం సాయంత్రం 6 గంటలకు హోటల్ కత్రియాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జాతీయ నేతలు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారని, రానున్న  వారం రోజుల పాటు ఇవి మరింత ఉధృతంగా సాగుతాయన్నారు. బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ, ప్రమోద్ సావంత్ ఈ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారని చెప్పారు. నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నా.. ఇంటింటి ప్రచారాన్ని ఆపవద్దని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, గ్రామ స్థాయి బీజేపీ నాయకులను ఆదేశించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. 

కేసీఆర్ పాలన వైఫల్యాలు, ఆయన కుట్రల గురించి.. కాంగ్రెస్ మోసపూరిత హామీలు, కుంభకోణాల గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించినట్లు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టో ఇంటింటికీ చేరేలా కార్యాచరణ రూపొందించుకున్నామని తెలిపారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ధరణి బాధితుల కోసం బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. ధరణి బాధితులు Dharanicomplaints.bjp@ gmail.comకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని.. లేదంటే 9391936262, 7330861919, 9281113099, 9281113031 మొబైల్ నెంబర్లకు ఫోన్ లు చేయాలని సూచించారు.