- 2016లో గేమింగ్ యాప్ యాడ్ చేశా..
- అది బెట్టింగ్ యాప్ అని తెలియదు: ప్రకాశ్‌రాజ్
- యువత బెట్టింగ్ జోలికి వెళ్లొద్దని విజ్ఞప్తి
- సీఐడీ విచారణకు హాజరు.. స్టేట్‌మెంట్ రికార్డు
హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్ యాప్ యాడ్ చేసి తప్పు చేశానని నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. గేమింగ్ యాప్ అనుకుని ప్రమోట్ చేశానని చెప్పారు. తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పుతప్పే అని అంగీకరించారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పొరపాట్లు చేయబోనని స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో బుధవారం సీఐడీ సిట్ విచారణకు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు.
హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని సీఐడీ ఆఫీస్‌కు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చారు. డీఎస్పీ అధికారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఆయనను ప్రశ్నించింది. ప్రకాశ్ రాజ్ వెల్లడించిన వివరాలతో స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. ఇదే కేసులో నటుడు విజయ్ దేవరకొండను మంగళవారం విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీని కూడా విచారించేందుకు సీఐడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేసులో మొత్తం29 మందిని విచారించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే షెడ్యూల్ సిద్ధం చేశారు. రోజుకు ఇద్దరి చొప్పున ప్రశ్నిస్తున్నారు.
తప్పు తప్పే.. మళ్లీ చేయను
సీఐడీ సిట్ విచారణ అనంతరం ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడారు.. “ నేను 2016లో గేమ్ అనుకుని ఒక యాప్ గురించి యాడ్ చేశాను. ఆ తర్వాత 2017లో అది బెట్టింగ్ యాప్‌గా మారింది. బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం విధించారు. దీంతో నేను రియలైజ్ అయ్యాను. యాప్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాను. ఇదంతా అప్పట్లో తెలియక చేశాను. నేను తప్పు చేయలేదు అనడం లేదు. తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు తప్పే. కాబట్టి క్షమాపణ కోరుతున్న.
మళ్లీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలేదు. ఇకపై కూడా చేయను. యువతకు కూడా చెప్తున్నా.. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకండి. ఎంతోమంది యువత బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోతున్నారు. వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. కష్టపడితేనే ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి అందరం కష్టపడి పని చేసుకుందాం.
సిట్ అధికారులకు పూర్తి వివరాలు, డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు అందజేశా. మళ్లీ ఎప్పుడైన యాప్స్ ప్రమోట్ చేశారా? అని అడిగితే.. చేయలేదని చెప్పా. ఇప్పటికే ఈడీ విచారణకు కూడా హాజరయ్యా” అని వెల్లడించారు.
