
ఎదురెక్కి గోదారి దగ్గరకు వెళ్లనున్న జలాలు
గోదావరిఖని, వెలుగు: గోదావరి ఉపనది ప్రాణహిత నీళ్లు ఎదురెక్కి గోదావరి దగ్గరకు పోయేందుకు సిద్ధమవుతున్నాయి. 105 కిలోమీటర్లు ప్రయాణించి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఇందుకోసం గోలివాడ దగ్గర పంప్‌హౌస్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. సుందిళ్ల బ్యారేజీ బ్యాక్ వాటర్ 4 టీఎంసీలు గోలివాడకు చేరుకున్నాయి. ఈ పంప్‌హౌస్ దగ్గర ముందుగా ‘యు’ ఆకారంలో కట్టిన కాపర్ డ్యామ్ దగ్గరున్న నీటిని 1.7 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెడ్ రెగ్యులేటరీ గేట్ల నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా ఫోర్ బేలోకి వదులుతారు. అక్కడి నుంచి భారీ పైపులైన్ల ద్వారా 1.1 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెలివరీ సిస్టమ్‌లోకి నీరు చేరుతుంది. అక్కడ 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 6 మోటర్లను నడిపి నీరు వదిలితే 800 మీటర్ల డెలివరీ చానల్ ద్వారా ప్రయాణించి డ్రాప్ పాయింట్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి సోమవారం నీరు చేరుతుంది. ఒకటో మోటార్‌ను నడిపి ప్రాణహిత నీటిని గోదావరి నీళ్లు నిల్వ ఉన్న ఎల్లంపల్లిలోకి ఎత్తిపోయనున్నారు. దీన్ని ప్రాజెక్టు ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు పర్యవేక్షిస్తున్నారు.
సుందిళ్ల, గోలివాడ మధ్య మస్తు నీళ్లు
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 1లో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్, అక్కడి నుంచి అన్నారం బ్యారేజీ, తిరిగి కాసిపేటలోని అన్నారం పంప్‌హౌస్, అటు నుంచి సుందిళ్లలోని బ్యారేజీలోకి నీళ్లను 4 పంపులతో ఇప్పటికే ఎత్తిపోశారు. సుందిళ్ల బ్యారేజీ నుంచి గోలివాడలోని పంప్‌హౌస్ 24.5 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం ఈ మధ్యనున్న నదీ ప్రాంతంలో 4 టీఎంసీల నీరుంది. దీంతో ఈ ప్రాంతం జలకళ సంతరించుకుంది.
ఎల్లంపల్లిలో 5 టీఎంసీల నిల్వ
ఎల్లంపల్లి ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా ఆదివారం నాటికి 5.11 టీఎంసీల నీరుంది. ఎగువన మహారాష్ట్ర, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో ఎల్లంపల్లికి 2,654 క్యూసెక్కుల నీరొచ్చింది. ఎన్టీపీసీ రిజర్వాయర్‌కు, మిషన్ భగీరథ కింద రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల నియోజకవర్గాలకు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కింద ఎల్లంపల్లి నుంచి 584 క్యూసెక్కుల నీటిని పంపారు. ప్రాణహిత నది నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోస్తే ప్రాజెక్టులోకి మరింత నీరొస్తుంది.