
- మేడిగడ్డ వద్ద 6 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో
- వందల ఎకరాల్లో నీట మునిగిన పత్తి
- కాళేశ్వరం వద్ద పది మీటర్లకు పైగా ఎత్తుతో పారుతున్న గోదారి
ఆసిఫాబాద్/కోటపల్లి, వెలుగు: మహారాష్ట్రతో పాటు ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత, వార్దా నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఎగువ నుంచి లక్షలాది క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ఆయా నదుల సమీప గ్రామాల ప్రజలతో పాటు రైతులు ఆందోళన చెందుతున్నారు.
వందల ఎకరాల్లో నీట మునిగిన పత్తి
ప్రాణహిత నది ప్రవాహం గంట గంటకు పెరుగుతుండడంతో పరివాహకంలోని పొలాలు నీటి మునుగుతున్నాయి. ప్రాణహిత బ్యాక్ వాటర్ కారణంగా బెజ్జూర్ మండలంలోని సోమిని, మెగవెల్లి, తాలయి, పెంచికల్‌పేట మండలం మురళీగూడ గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. దహేగాం మండలంతోపాటు మొట్లగూడ, రాంపూర్, రావులపల్లి, దిగిడ, లోహ గ్రామ శివారులోని సుమారు 900 ఎకరాల పత్తి పంట వరద పాలైంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని జనగామ, సూపాక, వెంచపల్లి, నందరంపల్లి, ఆలుగామా, సిర్సా, పుల్లగామ, అన్నారం, దేవులవాడ, అర్జునగుట్ట గ్రామాల్లో పత్తి వేసి నెల రోజులు గడవకముందే ప్రాణహిత ఉప్పొంగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
ప్రాణహిత, వార్దాతో పాటు పలు గ్రామాల సమీపంలోని వాగుల్లో నీటి ప్రవాహం పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి వచ్చేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిర్పూర్ టి మండలం వెంకట్రావ్‌పేట సమీపంలోని హైలెవెల్ బ్రిడ్జిని తాకుతూ వార్దా నది పారుతోంది. ఉధృతి ఇలాగే కొనసాగితే వరద బ్రిడ్జి పైనుంచి పారే అవకాశం ఉందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. తాలయి, పాపన్‌పేట మధ్యలో ఉన్న బ్రిడ్జి మీదకు నీరు రావడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆసిఫాబాద్ మండలం గుండి పెద్దవాగు ఉప్పొంగి పారుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు వాంకిడి మండలం ఖమన గ్రామం మీదుగా ప్రయాణిస్తున్నారు.
గోదావరిలో పెరిగిన వరద
మహదేవపూర్/ఏటూరునాగారం, వెలుగు: మహారాష్ట్రంలో భారీ వర్షాలు పడుతుండడంతో వెన్‌గంగ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. దీనికి తోడు ప్రాణహిత నది ఉప్పొంగి పారుతుండడంతో గోదావరిలో వరద ప్రవాహం భారీస్థాయిలో పెరిగింది. కాళేశ్వరం వద్ద ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరి నది 10.690 మీటర్ల ఎత్తుతో పారుతోంది. కాళేశ్వరం వద్ద నీటి ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక సమీపంలోకి చేరుకోవడంతో పోలీసులు ప్రజలను అలర్ట్ చేశారు.
గోదావరిలో బుధవారం 2.41 క్యూసెక్కుల వరద రాగా.. గురువారం ప్రాణహిత కారణంగా గోదావరిలో నీటి ప్రవాహం 6,36,136 క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. మరో వైపు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క బ్యారేజీకి వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి 5,56,100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్ట్ 59 గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 13 మీటర్ల మేర వరద ప్రవహిస్తోంది.
కుమ్రంభీం ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తివేత
ఎగ్గువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఆసిఫాబాద్ జిల్లా అడ గ్రామం సమీపంలోని పెద్దవాగుపై ఉన్న కుమ్రం భీం ప్రాజెక్ట్‌కు భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. దీంతో గురువారం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి కెపాసిటీ 10 టీఎంసీలు కాగా.. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 5.8 టీఎంసీ నీరు నిల్వ ఉంది.