ఎమ్మెల్యే వెహి కల్ పై దాడి చేసిన నిందితుల రిమాండ్ : మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్

ఎమ్మెల్యే వెహి కల్ పై  దాడి చేసిన నిందితుల రిమాండ్ :  మెదక్  డీఎస్పీ  ప్రసన్న కుమార్

మెదక్​, వెలుగు: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కులం పేరుతో మహిళను దూషించడమే కాకుండా, ఎమ్మెల్యే వాహనంపై రాళ్లతో దాడి చేసిన నిందితులను బుధవారం అరెస్ట్​ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు మెదక్  డీఎస్పీ  ప్రసన్నకుమార్  తెలిపారు. కాంగ్రెస్  మహిళ కార్యకర్త అఖిల మున్సిపల్  ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించగా, 15వ వార్డు బీఆర్ఎస్  అభ్యర్థి భర్త మల్లికార్జున్ గౌడ్, అతని అనుచరులు తమకు మద్దతు ఇవ్వాలని కోరారని చెప్పారు. అందుకు నిరాకరించడంతో 9న రాత్రి మల్లికార్జున్  గౌడ్  ఆమెను కులం పేరుతో దూషించినట్లు తెలిపారు. 

బాధితురాలు ఎమ్మెల్యే రోహిత్​కు ఫోన్  చేసి చెప్పగా, ఎమ్మెల్యే ఆమెను పరామర్శించేందుకు బయలుదేరగా మల్లికార్జున్  గౌడ్, జీవన్ రావు, వేణు, హబీబ్, మల్లేశ్​ తదితరులు ఎమ్మెల్యే వాహనంపై రాళ్లతో దాడి చేశారని తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్​ కింద కేసు నమోదు చేసి 13 మందిని అరెస్ట్​ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించామని డీఎస్పీ చెప్పారు. ఈ కేసులో మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్​ చేసి రిమాండ్‌‌‌‌కు తరలిస్తామని తెలిపారు.