నెల రోజుల్లో భీంగల్ఆస్పత్రిని ప్రారంభించాలె..అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్ : ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

నెల రోజుల్లో భీంగల్ఆస్పత్రిని ప్రారంభించాలె..అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్ : ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ, వెలుగు: నిజామాబాద్ జిల్లా భీంగల్ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్షం వహిస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం భీంగల్ లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్​లో మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో రూ.35 కోట్లతో 75 శాతం పనులు పూర్తయిన 100 పడకల ఆస్పత్రిని మున్సిపల్ ఎలక్షన్ల సమయంలో మూడు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన మహేశ్​ గౌడ్ మాట తప్పారని, ఫలితాలు వచ్చి నాలుగు నెలలైనా మిగతా 25 శాతం పనులు పూర్తి చేయలేదన్నారు.

రూ.7 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ 108 షాపుల షాపింగ్ కాంప్లెక్స్ పనులను బీఆర్ఎస్ హయాంలో దాదాపు పూర్తి చేయగా.. కాంగ్రెస్ రూ.90 లక్షల బిల్లులు చెల్లించకపోవడంతో  రెండున్నరేళ్లుగా పనులు నిలిచిపోయాయన్నారు. రూ.2.10 కోట్లతో అధునీకరించి ఆరు నెలలు నడిపిన బస్ డిపోను పునప్రారంభిస్తామని చెప్పి పట్టించుకోలేదన్నారు. కేటీఆర్ మంజూరు చేసిన రూ.11.5 కోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు మంత్రి సీతక్క కొబ్బరికాయ కొట్టి వదిలేశారని ఆరోపించారు. జులై14లోగా అభివృద్ధి పనులను ప్రారంభించకుంటే మహేశ్ గౌడ్​ను, కాంగ్రెస్ లీడర్లను భీంగల్​లో తిరగనివ్వమని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.