అక్షర సృజనకర్తలు ..సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడిదే కీలకపాత్ర

అక్షర సృజనకర్తలు ..సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడిదే కీలకపాత్ర

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడి పాత్రకు ప్రత్యామ్నాయం లేదు. ముఖ్యంగా భాషోపాధ్యాయుడు కేవలం పాఠ్యాంశాలను బోధించే వ్యక్తి మాత్రమే కాదు. భావాలను మలిచే శిల్పి, సంస్కారాలను నాటే రైతు, సృజనాత్మకతను వెలికితీసే మార్గదర్శి. పిల్లల మనస్సులు మట్టిముద్దల వంటివి. వాటిని ప్రేమతో, సహనంతో, సృజనాత్మక దృష్టితో తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులది. వాళ్లు పిల్లలకు అక్షరజ్ఞానం అందించడమే కాకుండా, మాతృభాషా సౌందర్యాన్ని పరిచయం చేస్తూ సాహిత్యాభిరుచిని పెంపొందిస్తారు.

బాల సాహిత్యం అనేది కేవలం పిల్లల వినోదానికి సంబంధించిన సాహిత్యం కాదు. అది వారి వ్యక్తిత్వ వికాసానికి, ఆలోచనా పరిధి విస్తరణకు, విలువల నిర్మాణానికి పునాది. కథలు, గేయాలు, పద్యాలు, నాటికలు, జీవిత చరిత్రలు, జానపద కథలు, నీతి కథలు వంటి ప్రక్రియల ద్వారా పిల్లలలో ఊహాశక్తి, భాషా సామర్థ్యం, నైతిక విలువలు వికసిస్తాయి. ఈ సాహిత్యాన్ని పిల్లలకు చేరువ చేయడంలో తెలుగు ఉపాధ్యాయులు వారధులుగా నిలుస్తున్నారు. 

తరగతి గదిలో తెలుగు ఉపాధ్యాయుడు బోధించే ఒక పద్యం, చెప్పే ఒక కథ, వినిపించే ఒక గేయం విద్యార్థి జీవితాన్ని ప్రభావితం చేయగలదు. పాఠ్యపుస్తకాల్లోని పాఠాలను మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న భావసౌందర్యాన్ని, జీవిత సందేశాన్ని వివరించడం ద్వారా విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందిస్తారు. భాషపై ప్రేమ కలిగిన విద్యార్థి సహజంగానే సాహిత్యం వైపు అడుగులు వేస్తాడు. ఆ తొలి అడుగుకు దారి చూపేది ఎక్కువగా ఉపాధ్యాయుడే.

నేడు పాఠశాలల్లో నిర్వహిస్తున్న పద్యపఠనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, భాషా ఉత్సవాలు వంటి కార్యక్రమాలు విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీస్తున్నాయి. చాలామంది విద్యార్థులు మొదటి కవితను, కథను, వ్యాసాన్ని తమ తెలుగు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే రాశారని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ కాలంలోనూ తెలుగు భాష మాధుర్యాన్ని, వైభవాన్ని, సాహిత్య సంపదను పిల్లలకు పరిచయం చేస్తూ భాషాభిమానాన్ని పెంపొందిస్తున్నారు. 

తెలుగు బాల సాహిత్య చరిత్రను పరిశీలిస్తే ఉపాధ్యాయుల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అనేక మంది తెలుగు ఉపాధ్యాయులు తమ వృత్తిని సాహిత్య సేవతో మేళవించి బాలసాహిత్యానికి విశిష్టమైన కృషి చేశారు. అందుకే బాల సాహిత్యంలో ఉపాధ్యాయుల రచనలు సహజత్వం, సరళతతో బాలలకు చేరువగా ఉంటాయి.

తెలుగు సాహిత్యంలో అనేక మంది ఉపాధ్యాయులు గొప్ప రచయితలుగా ఎదిగారు. మహాకవి గురజాడ అప్పారావు విద్యారంగంతో అనుబంధం కలిగి సమాజ సంస్కరణకు సాహిత్యాన్ని సాధనంగా మలిచారు. కందుకూరి వీరేశలింగం రచయితగా తెలుగు సమాజ చైతన్యానికి సేవ చేశారు. ఈ కాలంలో కూడా అనేక మంది తెలుగు ఉపాధ్యాయులు కథకులుగా, కవులుగా, బాలసాహిత్య సృజనకర్తలుగా గుర్తింపు పొందుతున్నారు. 

ఒక ఉపాధ్యాయుడు వెలిగించిన అక్షర దీపం, భవిష్యత్తులో ఒక రచయితగా, ఒక కవిగా, ఒక మేధావిగా సమాజానికి వెలుగునిస్తుంది. డిజిటల్ యుగంలో కూడా తెలుగు ఉపాధ్యాయులు తమ బాధ్యతను మరింత విస్తరించారు. సామాజిక మాధ్యమాలు, ఆన్‌‌‌‌లైన్ వేదికలు, డిజిటల్ పత్రికలు, యూట్యూబ్ సాహిత్య కార్యక్రమాల ద్వారా బాలసాహిత్యాన్ని కొత్త తరానికి చేరువ చేస్తున్నారు. విద్యార్థుల రచనలను డిజిటల్ రూపంలో ప్రచురించడం ద్వారా వారికి విస్తృత వేదికను కల్పిస్తున్నారు.

పిల్లలలో అక్షరాస్యతను నాటే గురువు, వారిలో సాహిత్యాసక్తిని పెంచే మార్గదర్శి, సృజనాత్మకతకు ప్రేరణనిచ్చే శిల్పి, సమాజానికి భావి రచయితలను అందించే సాహిత్య సేవకుడు. అందువల్ల తెలుగు బాల సాహిత్య వికాస చరిత్రలో తెలుగు ఉపాధ్యాయుల కృషి ఒక ప్రత్యేక అధ్యాయం. 

- యాడవరం చంద్రకాంత్ గౌడ్, కవి రచయిత సమీక్షకులు-